దినేష్‌రెడ్డి నియామకాన్ని తప్పుపట్టిన హైకోర్టు

ప్రభుత్వానికి రూ.5వేలు జరిమానా
హైదరాబాద్‌, ఆగస్టు 16 : రాష్ట్ర డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో కేసు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో గతంలో కేంద్ర అడ్మినిస్ట్రేషన్‌ ట్రిబ్యునల్‌(క్యాట్‌) ఇచ్చిన తీర్పును హైకోర్టు గురువారం సమర్థించింది. రెండు వారాల్లో దినేష్‌రెడ్డి స్థానంలో మరొకరిని డీజీపీగా నియమించాలని, అప్పటి వరకు దినేష్‌రెడ్డిని ఇన్‌చార్జి డీజీపీగా కొనసాగిస్తూనే ఆయన ఇచ్చే జీతభత్యాలను నిలిపివేయాలని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముగ్గురు పేర్లతో కూడిన ఒక ప్యానల్‌ను కేంద్రానికి పంపించాలని వారం రోజుల్లో డీజీపీ నియామకానికి సంబంధించిన ఒక కమిటీని వేయాలని కూడా హైకోర్టు మొట్టికాయ వేసింది. డీజీపీ నియామకంలో విధి విధానాలు పాటించనందుకు ప్రభుత్వానికి రూ.5వేల జరిమానాను కూడా కోర్టు విధించింది. గతంలో క్యాట్‌ దినేష్‌రెడ్డి నియామకం చెల్లదంటూ తీర్పునిచ్చిన విషయం విదితమే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, దినేష్‌రెడ్డి.. వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు పై విధంగా స్పందించింది. ముగ్గురు పేర్లతో కూడిన ఒక జాబితాను నియామక కమిటీ యూపీఎస్సీకి పంపించాలని కూడా హైకోర్టు సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కష్టాల్లో కూరుకుపోయింది. జస్టిస్‌ జి. రఘురాం, జస్టిస్‌ ఎన్‌. రామచంద్రారావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ విధంగా స్పందించింది. అయితే పోలీస్‌శాఖ హెడ్‌గా, ఆయన తీసుకుంటున్న వేతనాన్ని నిలిపివేయాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. గతంలో దినేష్‌రెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ గౌతమ్‌కుమార్‌ క్యాట్‌ను ఆశ్రయించారు. తనకంటూ జూనియర్‌ అయిన దినేష్‌రెడ్డిని నియమించడంలో ప్రభుత్వం తప్పు చేసిందంటూ ఆయన క్యాట్‌లో వాదించారు. ఈవిషయాన్ని భరించలేక గౌతమ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీవిరమణ కూడా చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడ్డట్టయింది.