దేశం గర్వించేలా తెలంగాణ పురోగమనం

సంక్షేమం,అభివృద్దిలో ఆదర్శ రాష్ట్రం

24గంటల కరెంట్‌ ఇస్తున్న తొలి రాష్ట్రం

రైతులకు పెద్దపీట వేస్తున్నాం

రైతుంబంధు,బీమా,ప్రాజెక్టుల నిర్మాణం

తెలంగాణ అభివృద్దిని ప్రశంసించిన ప్రధాని మోడీ

గోల్కొండ కోటలో వరుసగా ఐదోసారి జెండా ఎగరవేత

ప్రజలకు పంద్రాగస్ట్‌ సందేశంలో సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): అతి తక్కువ కాలంలోనే దేశం గర్వించే రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అనేక పథకాలతో తెలంగాణలో అభివృద్దిని పరుగులు పెట్టిస్తున్నామని ప్రకటించారు. గోల్కొండకోటలో నిర్వహించిన 72వ స్వాతంత్య దిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చారిత్రక గోల్కొండ కోటలో వరుసగా ఐదోసారి జాతీయ జెండా ఎగుర వేసినందుకు గర్విస్తున్నానని సీఎం పేర్కొన్నారు. సకల రంగాల్లో తెలంగాణ వేగంగా పురోగమిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే అనూహ్యమైన ప్రగతిని తెలంగాణ నమోదు చేసిందన్నారు. అభివృద్ది ,సంక్షేమంలో తెలంగాణ ముందున్నదని, దీనిని ప్రధాని కూడా అభినందించారని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలన్నీ నేడు పునరుత్తేజం పొందాయని, సంక్షేమ పథకాలతో అణగారిన వర్గాలకు అండదండలు అందిస్తున్న తీరు దేశానికి ఆదర్శంగా నిలిచామని అన్నారు. ఆవిర్భవించిన అనతికాలంలోనే దేశం గర్వించదగ్గ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రభుత్వం పరిణతితో వ్యవహరిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. తెలంగాణ ప్రగతిపథంలో పయనిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 24గంటల కరెంట్‌, రైతుబంధు రైతుబీమా, రైతు సమన్వయ సమితుల ఏర్పాటు విప్లవాత్మకమన్నారు. నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నాం. పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నాం. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. రైతుల విషయంలో రాజీలేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 24 గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తున్నాం. దేశంలో రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వివరించారు.

నేటినుంచి రైతుబీమా అమల్లోకి

రాష్ట్రంలోని రైతులందరికీ భరోసా కల్పించేందుకు రైతుబీమా పథకాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. రైతు ఏ కారణంతో మరణించినా అతని కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. భారత జీవిత బీమా సంస్థ – ఎల్‌ఐసీ ద్వారా ఈ పథకం అమలవుతుంని అన్నారు. ప్రతీ ఏటా చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రైతుల తరపున ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రూ. 5 లక్షల బీమా మొత్తం రైతు మరణించిన పది రోజుల వ్యవధిలోనే ఆయన కుటుంబానికి అందించే విధంగా ఈ పథకాన్ని ప్రభుత్వం రూపొందించిందని సీఎం తెలిపారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణా పన్ను రద్దు చేశామని తెలిపారు. కల్తీ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపామని, కల్తీ విత్తనాలు సరఫరా చేస్తున్న

కంపెనీలపై పీడీయాక్ట్‌ నమోదు చేస్తున్నట్లుగా సీఎం తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందుబాటులోకి తెచ్చామన్నారు. మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టామని, ధాన్యం నిల్వ చేసుకునేందుకు పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు. భూ వివాదాలను పరిష్కరించేందుకు భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భూముల రిజిస్టేష్రన్ల విధానంలో సంస్కరణలు చేపట్టామని చెప్పారు. భూ రికార్డుల నిర్వహణకు ధరణివెబ్‌సైట్‌ రూపొందిస్తున్నామని అన్నారు. రైతుబంధు చెక్కుల పంపిణీ పండుగలా నిర్వహించామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచే దిశగా ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటున్నదని సీఎం స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేదన్నారు. రైతుల్లో విశ్వాసం పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. రూ. 17 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఎగబెట్టిన ఇన్‌పుట్‌ సబ్సిడీలను తెలంగాణ ప్రభుత్వం సత్వరమే చెల్లించిందని గుర్తు చేశారు. విత్తనాలను, ఎరువులను సత్వరమే సరఫరా చేస్తున్నాం. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు ముందులు విక్రయిస్తున్న వారిపై పీడీయాక్ట్‌ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రైతులకు 24 గంటలు కరెంట్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ అద్భుతం సాధించడానికి ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా నిబద్దతతో కృషి చేసిందని సీఎం తెలిపారు. గ్రామాల్లో కూలీల కొరతను అధిగమించేందుకు రైతులకు సబ్సిడీపై వరినాటు యంత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఈ ఏడాది మండలానికి 10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,500 వరినాటు యంత్రాలు పంపిణీ చేస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు.

భూ రికార్డుల ప్రక్షాళన

భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూరికార్డుల ప్రక్షాళనను చేపట్టి విజయవంతంగా పూర్తి చేశామన్నారు. దీంతో 94 శాతం భూముల యాజమాన్యాల హక్కుల విషయంలో స్పష్టత వచ్చిందన్నారు. భూముల రిజిస్టేష్రన్లలో ఇకపై వందకు వంద శాతం పారదర్శకత సాధించేందుకు సమూల సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం ఉద్ఘాటించారు. భూరికార్డుల నిర్వహణలో పారదర్శకత కోసం ధరణి వెబ్‌సైట్‌కు రూపకల్పన చేసిందన్నారు. పంట పెట్టుబడి పథకం కింద రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ. 8 వేలు ఇస్తున్నామని సీఎం తెలిపారు. యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు పనిముట్లపై 50 నుంచి 90 శాతం సబ్సిడీ కల్పించామన్నారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, డ్రిప్‌ ఇరిగేషన్‌పై దళితులు, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ కల్పించనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశామన్నారు. మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టామనీ సీఎం పేర్కొన్నారు. 22.47 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణం చేపట్టామన్నారు. వచ్చే నవంబర్‌లో రైతు బంధు రెండో విడత చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని స్పష్టం చేశారు.

24గంటల కరెంట్‌ దేశంలోనే ప్రథమం

దేశంలో 24 గంటల విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం పేర్కొన్నారు. కొత్తగా 12

లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తున్నామన్నారు. ఈ ఏడాది మరో 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పడానికి ఇవన్నీ తార్కాణమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నేడు యావత్‌ దేశానికి ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాను అందించిందని తెలిపారు. సమయం వృథా చేయకుండా తెలంగాణను అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నాం. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో సంపూర్ణంగా నిమగ్నమైందని ఇటీవల పార్లమెంట్‌లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే ప్రస్తావించారని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఈ నాలుగు సంవత్సరాల విలువైన సమయాన్ని తెలంగాణ భవిష్యత్‌కు తగిన అభివృద్ధి ప్రాతిపదికలు నిర్మించేందుకు సమర్థవంతంగా వినియోగించుకున్నామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రస్థానం సాగుతున్నదని సీఎం చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ వేగంగా పురోగమిస్తోందని… ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

ప్రాజెక్టుల కోసం ఏటా రూ. 25 వేలకోట్ల బడ్జెట్‌

ప్రాజెక్టుల నిర్మాణం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర బ్జడెట్‌లో ఏటా రూ. 25 వేల కోట్లను ప్రభుత్వం కేటాయిస్తున్నదని సీఎం గుర్తు చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నాం. ఈ ఏడాది మరో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. గొల్లకుర్మలకు పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై 2.13 లక్షల మంది రైతులకు బర్రెల పంపిణీ ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం కోసం కావాల్సిన చేప పిల్లలను, రొయ్య పిల్లలను ప్రభుత్వమే సరఫరా చేస్తున్నదని పేర్కొన్నారు. రరికార్డు సమయంలో భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తి చేశామన్న కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా నిర్మిస్తున్నామన్నారు. మిషన్‌ కాకతీయతో చెరువులను బాగు చేస్తున్నామని తెలిపారు. త్వరలో తెలంగాణ మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రంగా మారనుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధి కోసం మూడంచెల వ్యూహాం అమలు చేస్తున్నామన్నారు. గొల్లకుర్మలకు 65 లక్షల గొర్రెలతో పాటు దాణాను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకే బర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టామని, మత్స్యకారులుకు ఉచితంగా చేపల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రజా సంక్షేమంలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు.

చేనేతకు చేయూత

చేనేత, పవర్‌ లూమ్‌ ఉత్పత్తులను ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మిస్తున్నామని కేసీఆర్‌ అన్నారు. రజక, నాయీ బ్రాహ్మణులకు ఆధునిక వస్తువులు అందజేస్తామని, సంచార కులాల అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 4 లక్షల మంది బీడీ కార్మికులకు వెయ్యి పెన్షన్‌ అందిస్తున్నామని, హాస్టల్‌ విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గుడుంబాను అరికట్టామని ఈ సందర్భంగా కేసీఆర్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులకు వారికే ఖర్చు చేస్తున్నామన్నారు.

దళితులకు 12,974 ఎకరాల భూమి పంపిణీ

దళితులకు 12,974 ఎకరాల భూమి పంపిణీ చేశామన్నారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేవారు. 5వేల మంది మౌజమ్‌, ఇమామ్‌లకు జీవనభృతి

కల్పించామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.120 కోట్లు కేటాయించామని చెప్పారు. ఆశా వర్కర్ల జీతాన్ని రూ.6 వేలకు పెంచామన్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు రిస్క్‌ అలవెన్స్‌ అందిస్తున్నామన్నారు. మిషన్‌ భగీరథ దాదాపుగా పూర్తికావొచ్చిందని, అనుకున్న సమయానికి ముందే ఇంటింటీకి మంచినీరు అందజేస్తామని స్పష్టం చేశారు. మిషన్‌ భగీరథపై 11 రాష్టాల్రు ఆసక్తి చూపుతున్నాయన్నారు.

హైదరాబాద్‌లో 40 బస్తీ దవాఖాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామని, బీసీలకు మరో 119 రెసిడెన్షియల్‌ స్కూళ్లు మంజూరు చేశామని సీఎం తెలిపారు. మైనార్టీ యువతకు 80 శాతం సబ్సిడీతో రుణాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశీ విద్య కోసం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. హరితహారంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 12,751 గ్రామపంచాయితీలు ఉన్నాయని, 7 జోన్లు, 2 మల్లీ జోన్లకు త్వరలో కేంద్రం నుంచి ఆమోదం లభిస్తుందని అన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు. పెద్ద కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయని తెలిపారు.

పేదలకోసం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం

ప్పటివరకు 2,72,723 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మించామని చెప్పారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టం పోలీసుల చేతిలో బ్రహ్మాస్త్రంగా అభివర్ణించారు. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ తయారవుతోందని, అలాగే హైదరాబాద్‌ సిగ్నల్‌ ఫ్రీ సిటీగా తయారవుతోందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులను బాగు చేస్తున్నామని కేసీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లో మరో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ దగ్గర రీజనల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మిస్తామన్నారు. త్వరలో మెట్రో రెండో దశ సేవలు ప్రారంభంకానున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.