దేశాభివృద్ధిలో కార్మికులదే కీలక పాత్ర

C

– ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ పథకం ప్రారంభించిన ప్రధాని మోదీ

బాలియా,మే1(జనంసాక్షి): దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులందరికీ వందనాలు. దేశంలోని కార్మికులందరికీ ఒకప్పుడు ప్రపంచంలోని కార్మికులంతా ఐక్యం కావాలన్న నినాదం ఉండేది.. ఇప్పుడున్న నినాదం కార్మికులంతా తరలిరండి.. ప్రపంచాన్ని ఐక్యం చేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని బాలియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం’ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 5 కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు ప్రధాని చేతుల విూదుగా గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. బాలియా ప్రజలు తమ జీవితాన్ని దేశానికి అంకింతం చేశారు. గొప్ప పోరాటయోధుడైన మంగల్‌పాండేను బాలియా.. దేశానికిచ్చిందని గుర్తు చేశారు. ‘నాపై విూరు చూపిస్తున్న ప్రేమకు అభివృద్ధితో బదులిస్తా. పేదలను దృష్టిలో ఉంచుకొనే కార్యక్రమాలు చేపడుతున్నాం. పేదల కోసమే ప్రభుత్వం పని చేస్తుందని పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో నా మొదటి ప్రసంగంలోనే చెప్పా. కార్మికులకు సంబంధించిన అంశాలపై చాలా కృషి చేశాం’ అని మోదీ వివరించారు.

‘వారి కోసం పనిచేస్తే ఎంతో ఆనందం’

పేదల ప్రజల సాధికారతకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. లబ్ధిదారులకు ఈ-రిక్షాలు, ఈ-పడవలు అందజేశారు. సంక్షేమ పథకాలతో నిరుపేదలు బలోపేతం కావాలని, ఓటు బ్యాంకు కాదని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు.పేదలకు చేయూతనిస్తే పేదరికం నుంచి బయటపడతారని చెప్పారు. తాము ప్రవేశపెట్టిన ‘జన్‌ ధన్‌ యోజన’తో బ్యాంకులు ఎటువంటి హావిూ లేకుండా రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. పేద ప్రజల అభ్యన్నతి కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. వారణాసిలో ఈ- రిక్షా, ఈ-పడవల్లో మోదీ ప్రయాణించారు. ‘చాలా పేద కుటుంబుంలో పుట్టి పెరిగాను. మా ఇంటికి కిటికీలు కూడా ఉండేవి కావు. ఇంట్లో వంట కట్టెల పోయ్యిపై అమ్మ వంట చేయాల్సి వచ్చేది’ అని ప్రధాని నరేంద్ర మోదీ తన కుటుంబ నేపథ్యాన్ని వివరించారు. ఉత్తరప్రదేశ్‌ లోని బాలియాలో ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం మోదీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన మరికొన్ని అంశాలు…  మొత్తం 5 కోట్ల మందికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందజేస్తామని పేర్కొన్నారు. మహిళల పేరిటే ఉచిత గ్యాస్‌ కనెక్షన్ల పంపిణీ జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమ్మ కష్టాలు చూసిన వాడ్ని కనుక మహిళల ఇబ్బందులను తొలగించేందుకు తమ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు ఓట్ల గురించి మాత్రమే ఆలోచించాయి తప్ప ప్రజల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు పనిచేయలేదని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.