ధరలను అదుపు చేయండి: జేసీ
గుంటూరు, జూలై 19 : జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలపై నిఘా పెంచాలని జేసీ డాక్టర్ యువరాజ్ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్‌లోని తన చాంబర్‌లో గురువారం జిల్లాస్థాయిలో నిత్యావసరవస్తువుల ధరల నియంత్రణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి డిఎస్‌వో కృష్ణారావు అధ్యక్షత వహించారు. జెసి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వ్యవసాయ ఉత్పత్తుల ధరలను వ్యాపార వర్గాలు గణనీయంగా పెంచి వినియోగదారులకు ఇబ్బందుల కల్గిస్తున్నట్లు అన్నారు. ఆయాశాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిక్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి ధరలు పెరుగుదలపై నియంత్రణ ఉంచాలన్నారు. బియ్యం, కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. వీటిని పండిస్తున్న రైతులకు మాత్రం తక్కువ ధరలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి కమిటీి సభ్యులువారి పరిధిలోని విభాగాల ద్వారా ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. వ్యవసాయశాఖ జెడి శ్రీధర్, ఉద్యాన శాఖ ఎడి రమణ, మార్కెఫెడ్ మేనేజర్ నరసింహరావు, మార్కెటింగ్ శాక ఎడి సువర్చల, డిసివో శ్రీకాంత్, రైతుబజార్ల ఎస్టేట్ అధికారులు, తదితరులు పొల్గొన్నారు.