నడిరోడ్డున నగ్నంగా నరకయాతన అనుభవించాం హస్తినలో ఆ కాళరాత్రి అయ్యో అన్నవారు లేరు పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే నా స్నేహితురాలు బతికిఉండేది ఘటనా స్థలం ఏ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందని పోలీసులు రెండుగంటలు వాదించుకొని కాలయాపన చేశారు


న్యూఢిల్లీ, జనవరి 5 (జనంసాక్షి):

యావత్తు భారత జాతిని కదిలించిన వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటన జరిగిన రోజున ఢిల్లీ పోలీసులు, స్థానికులు స్పందించిన తీరు దిగ్భాంతికి గురి చేస్తోంది. కీచకుల చేతిలో బలైపోయి తీవ్రంగా గాయపడిన బాధితురాలు, ఆమె స్నేహితుడు దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై పడి ఉన్నా అటు పోలీసులు కానీ, ఇటు స్థానికులు కానీ పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ రోజు రాత్రి దుండగులు విద్యార్థినిని సామూహికంగా అత్యాచారం చేసి, సున్నితావయవాలను తీవ్రంగా గాయపరిచి, ఆమెతో పాటు ఆమె స్నేహితుడిని బస్సులోంచి బయటకు విసిరేశారు. ఆ ఏం జరిగిందనే దానిపై బాధితురాలి స్నేహితుడు తొలిసారి బహిరంగంగా పెదవి విప్పాడు. ‘డ్రైవర్‌, క్లీనర్‌ మినహా మిగిలిన వారు ప్రయాణికుల్లా నటించారు. కాసేపటికి ముగ్గురు వచ్చి నిర్భయను వేధించడం మొదలుపెట్టారు. మా దుస్తులన్నీ చించేశారు. నేను ఎదురుతిరిగాను. వారితో పెనుగలాట జరిగింది. మరో ఇద్దరు రాడ్‌తోవచ్చి నన్ను కొట్టారు. నేను స్పృహ తప్పి పడిపోయా. నిర్భయ పోలీసులకు  ఫోన్‌ చేసేందుకు యత్నించగా, వారు మొబైల్‌ లాక్కున్నారు. ఆమెను వెనక్కు తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌ చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు బస్సులో తిప్పుతూ దౌర్జన్యం చేశారు. సాయం చేయమని ఎంతగా అర్ధించినా ఎవరు పట్టించుకోలేదు. నిందతులు బస్సులోంచి బయటకు విసిరేశారు. బస్సుతో మమ్మల్ని తొక్కించేందుకు       యత్నించారు. తృటిలో తప్పించుకున్నాం. బట్టలు లేకుండానే రోడ్డు పక్కనే పడి ఉన్నాం’ అని వివరించాడు.’ఆ రోజు కీచకుల దాడిలో నా స్నేహితురాలు తీవ్రంగా గాయపడింది. విపరీతంగా రక్తం కారుతోంది. కార్లు, ఆటోలు, బైక్‌లపై వెళ్తున్న వారు ఆగి చూసి వెళ్లిపోతున్నారు. సహాయం చేయాలని వారిని అర్థించా. ఒక్కరు కూడా స్పందించ లేదు. రోడ్డుపై పడి ఉన్న మా దగ్గరకు 45 నిమిషాల తర్వాత మూడు పోలీసు వ్యాన్లు వచ్చాయి. కానీ వారు మమ్మల్ని అలాగే వదిలేసి… తమ స్టేషన్ల పరిధి గురించి వాదించుకుంటూ సమయాన్ని వృథా చేశారు. దాదాపు అరగంట తర్వాత ఆస్పత్రికి తరలించారు’ అని దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థిని స్నేహితుడు వెల్లడించారు. అప్పటికీ కూడా పోలీసులు తమను కనీసం ముట్టుకునేందుకు కూడా సంశయించారని ఆయన చెప్పారు. ‘తీవ్రంగా గాయపడిన మమ్మల్ని లేపడానికి కూడా యత్నించలేదు. స్నేహితురాలిపై కప్పేందుకు పోలీసులు నాకు దుప్పటి ఇవ్వగా, దాన్ని ఆమెపై కప్పాను. తీవ్ర గాయాలతో ఉన్న నేనే ఆమెను ఎత్తుకొని పోలీసు వ్యాన్‌లోకి చేర్చాను’ అని వివరించారు. పోలీసులు సవిూపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించకుండా సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ రోజు గనుక ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండి ఉంటే, ఆస్పత్రికి వెళ్లే సరికే ఆమె మృతి చెంది ఉండేది’ అని అన్నారు. గ్యాంగ్‌రేప్‌పై ఆందోళనలు ఉద్ధృతం కావడంతో వాటిని నియంత్రించడం సాధ్యం కాదని భావించే.. ‘నిర్భయ’ను సింగపూర్‌ ఆస్పత్రికి తరలించాడని ఆయన ఆరోపించారు. కేవలం క్యాండిల్స్‌ వెలిగించినంత మాత్రాన వచ్చేదేవిూ లేదని, ముందు మనలో మార్పు రావాలని ఆయన ఆందోళనకారులకు సూచించారు. అయితే, అతడి ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. సమాచారం అందుకున్న 24 నిమిషాల్లో బాధితురాలిని సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించామని తెలిపారు.