నాకు మద్దతివ్వండి ప్రచారాన్ని మొదలు పెట్టిన ప్రణబ్‌

రాష్ట్రపతి ఎన్నికలో ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తనకు మద్దతు ఇవ్వవలసిందిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి)కి తిరిగి విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థిత్వాన్ని సమర్థించడంపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోని రాజకీయ పార్టీలు ఆవిధంగా నిర్ణయం తీసుకో వాలని ఆయన ఆదివారం కోరారు. ధకూరియా లోని తన నివాసం నుంచి బేలూరు మఠ్‌కు బయలుదేరే ముందు ప్రణబ్‌ ముఖర్జీ విలేకరులతో మాట్లాడుతూ, ‘నేను యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థిని. అన్ని పార్టీల మద్దతును అర్థిస్తున్నాను’ అని చెప్పారు. తనకు మద్దతు ఇవ్వాలని నిశ్చయించుకున్న రాజకీయ పార్టీలు తనకు వోటు వేస్తాయని ఆయన చెబుతూ, ‘ఇంకా నిర్ణయం తీసుకోని పార్టీలకు ఒక నిర్ణయం తీసుకుని యుపిఎ అభ్యర్థికి మద్దతు ఇవ్వవ లసిండిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందని యుపిఎ ఇప్పటికీ ఆశిస్తున్నట్లు ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ చెప్పడంపై వ్యాఖ్యానించవలసిందని అడిగినప్పుడు, ‘ప్రధాని అన్న మాటలపై నేను వ్యాఖ్యానించేదేమీ లేదు’ అని ప్రణబ్‌ సమాధానం ఇచ్చారు. మరి తన అభ్యర్థిత్వాన్ని సమర్థించవలసిందిగా కోరేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీతో భేటీ అవుతారా అని శనివారం రాత్రి అడిగినప్పుడు, ‘కచ్చితంగా ఆమెతో మాట్లాడతాను. అయితే, ఇప్పటికిప్పుడు అటువంటి అవకాశం లేదు’ అని ఆయన సమాధానం ఇచ్చారు.