నాయకత్వ లోపమే జిల్లా ఏర్పడక పోవడానికి కారణం:- రఘువీర్ రెడ్డి

మిర్యాలగూడ. జనం సాక్షి
       మిర్యాలగూడ జిల్లా ఏర్పడక పోవడానికి నాయకత్వ లోపమే కారణమని మాజీ హోం మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడను జిల్లాగా చేయాలని కోరుతూ శనివారం మిర్యాలగూడ కు విచ్చేసిన కుందూరు రఘువీర్ రెడ్డికి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల్లో సగం జిల్లాలకు జిల్లా ఏర్పడే అర్హత లేదని అయినప్పటికీ జిల్లాగా చేశారని  అన్ని అర్హతలున్న మిర్యాలగూడను జిల్లా చేయకపోవడం బాధాకరమన్నారు. స్థానిక నాయకులు జిల్లా ఏర్పాటు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి ఇసుక రాకపోవడంతోనే జిల్లాగా మిర్యాలగూడ కాలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమించడం అభినందనీయమన్నారు. జిల్లా ఏర్పాటు ఉద్యమంలో తాను స్వయంగా పాల్గొంటానని, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కృషిచేస్తానని అన్నారు. అదేవిధంగా కే ఎల్ ఎన్ కళాశాల కరస్పాండెంట్ హనుమంత రెడ్డి ప్రిన్సిపాల్ కిరణ్, శివాని స్కూల్ కరస్పాండెంట్ శ్యాంసుందర్ రెడ్డి తదితరులకు జిల్లా ఏర్పాటు ఉద్యమానికి మద్దతు పలకాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం,జిల్లా సాధన సమితి నాయకులు బంటు వెంకటేశ్వర్లు, చేగొండి మురళి యాదవ్, ఫారుక్,దాసరాజు జయరాజు, గొల్ల గోపుల సాయి తదితరులు పాల్గొన్నారు.