నిధులు ఉన్నా నత్తనడకన పనులు

కాకినాడ,మార్చి18(జ‌నంసాక్షి): అసెంబ్లీ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముఖ్యమంత్రి నిధులు  ఇచ్చినా.. వాటితో పనులు చేపట్టడంలో నిర్లిప్తత రాజ్యమేలుతోందన్న విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్‌డీఎఫ్‌) పేరుతో నిధులు  మంజూరు చేశారు. దీంతో ఎమ్మెల్యేలు తమకంటూ నిధులు లేకపోవడంతో కొన్నేళ్లుగా నిర్వేదం చెందుతున్నారు. దీంతో సీఎం తన విచక్షణ నిధుల నుంచి కోరిన ఎమ్మెల్యేలకు ఎస్‌డీఎఫ్‌ పేరుతో మంజూరు చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో అక్కడి టిడిపి ఇన్‌ఛార్జిలకు వీటిని కేటాయిస్తున్నారు. వీటిని రహదారులు, తాగునీటి సౌకర్యం, సామాజిక భవనాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలని నిర్ణయించారు. కొన్ని పనులు నామినేషన్‌ పద్ధతిపై, మరికొన్ని టెండర్లు విధానంలో చేపట్టడానికి నిర్ణయించారు. ఎస్‌డీఎఫ్‌ పనులను గ్రామాల్లో పంచాయతీరాజ్‌ శాఖ, నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో పురపాలక శాఖ ఇంజినీర్లు నిర్వహిస్తున్నారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించటానికి వినియోగించే ఎస్‌డీఎఫ్‌ నిధులను ఖర్చు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. నామినేషన్‌ పద్ధతిపై పనులు చేపట్టడానికే ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు. పురపాలక శాఖ ద్వారా చేపట్టే పనులు కూడా చాలా మందకొడిగా
సాగుతున్నాయి. పనులకు టెండర్లు పూర్తయినా, ఒప్పందం, వర్కు ఆర్డర్‌ జారీ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో పనులు ముందుకు సాగడంలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఈ పనుల ప్రగతిపై సవిూక్షలు నిర్వహిస్తే ఫలితముంటుంది. ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

తాజావార్తలు