నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టండి: మంత్రి కాసు

గుంటూరు, ఆగస్టు 3 : జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన వుందని మంత్రి కాసు కృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు వచ్చిన ఆయనను ఆర్‌ అండ్‌ బి గెస్టుహౌస్‌లో పలు శాఖల అధికారులు కలిసి నీటి సమస్య గురించి అడిగి తెలుసుకొన్నారు. మరో పక్షం రోజుల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా వారు ఆయన వివరించారు.ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కనీసం తాగునీటి కోసమైనా సాగర్‌ జలాలు విడుదల చేయాలని, ఇంతకు ముందు ఇరిగేషన్‌ శాఖామంత్రి సుదర్శన్‌రెడ్డితో పాటు ముఖ్యమంత్రికి పలుమారులు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. అయితే కోర్టు పరిధిలో ఉన్న అంశం కావడంతో వారు అడ్వకేట్‌ జనరల్‌తో మాట్లాడారన్నారు. హైదరాబాద్‌లో సాగర్‌జలాలు విడుదలపై జరిగిన వివరాలను మైనర్‌ ఇరిగేషన్‌ సెక్రటరీ అజయేంద్ర పాల్‌కు ఫోనుచేసి వాకబు చేశారు. సమావేశంలో ఎటువంటి నిర్ణయము తీసుకోలేదని తెలియడంతో అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు నీరు విడుదల చేస్తేనే, ఇక్కడకు చేరేందుకు పక్షం రోజులు పడుతుందన్నారు. దీనిపై మరోసారి ముఖ్యమంత్రితో పాటు, సంబంధిత అధికారులతో మాట్లాడతానన్నారు. నీరు విడుదల చేయకుంటే నల్గొండ, మిర్యాలగూడాలకు తాగునీటి ఎద్దడి తప్పవన్నారు. ఇటు నీరు విడుదల చేసే నీటి మట్టం పడిపోయి హైదరాబాద్‌కు నీటి సరఫరా కష్టమవుతుందన్న అభిప్రాయాన్ని ఇరిగేషన్‌ శాఖాధికారులు వ్యక్తం చేశారు. ఒత్తిడి తీసుకొని వచ్చి నీటి విడుదలకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్య మాట్లాడుతూ నేడు ఆయకట్టు నీటి సంగతి పక్కన పెడితే తాగునీటి పోరాటాలు ఎక్కువయ్యాయన్నారు. దీనికి కలెక్టర్‌ సమాధానమిస్తూ ఇసుక సీనరేజ్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి టన్నుకు 5వేల కన్నా ఎక్కువ అమ్మకుండా ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు క్వారీలు నడుస్తున్నాయని, త్వరలో మరో మూడు క్వారీలకు అనుమతి వచ్చే అవకాశం వుందన్నారు. అంతకు ముందు అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు రవికృష్ణ సత్యనారాయణలు మంత్రి కాసును మర్యాదాపూర్వకంగా కలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఈశ్వరరావు, జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఊర భాస్కరరావు ఉన్న కూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పొలొన్నారు.

వేర్పాటువాదం దేశ భద్రతకు ముప్పు
గుంటూరు, ఆగస్టు 3 (ఎపిఇఎంఎస్‌): వేర్పాటు వాద ఉద్యమాలు దేశభద్రతకు, సమగ్రతకు అత్యంత ప్రమాదరమైనవని సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ సమితి కన్వీనర్‌ ఎండి హిదాయత్‌ హెచ్చరించారు. శుక్రవారం అరెండెల్‌ పేటలోని వైస్‌ డీలర్స్‌ కల్యాణమండంలోని జెఏసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు దశాబ్దాలుగా కాపాడుకొంటూ వస్తున్న రాష్ట్ర సమైక్యతను విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకొన్న దుష్టశక్తులకు తగిన గుణపాటం చెప్పాలని పిలుపునిచ్చారు. తాజాగా రాయలసీమ పేరుతో మరో ఉద్యమాన్ని చేయటానికి సీమ నాయకులు బయల్దేరారన్నారు. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర పేరిట మరో ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపడే పనిలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతాలకు అతీతంగా ప్రజలు సంఘటితమై సమైక్యాంధ్రాను కాపాడుకునే దిశగా నడుంబిగించాలన్నారు. జెసీఏ కో కన్వీనర్‌ హనుమంతరావు మాట్లాడుతూ కృష్ణ డెల్టా రైతు ప్రయోజనాల కోసం ఎంతటి త్యాగానికికైనా తాము సిద్ధమేనన్నారు. సీమాంధ్రమంత్రులు, ప్రజా ప్రతినిధులు వారంరోజుల లోపు సమైక్యవాదానికి అనుకూలంగా స్పష్టమైన ప్రకటన ఇవ్వకుంటే ప్రజాద్రోహులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జెఎసి నాయకులు, ఎండి ఇంతియాజ్‌, సి. హెచ్‌ కనకారావు, నల్లమోతు అజయ్‌చౌదరి, యరమాలవిజయ్‌ కిరణ్‌, నగర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జి.సూర్యం, తదితరులు పాల్గొన్నారు.