మాపై విచారణ జరపండి:హరీశ్‌.. ఓకే అన్న సీఎం

ఓఆర్‌ఆర్‌ టెండర్లపై సిట్‌
` దర్యాప్తుకు ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి
` అవినీతి అక్రమాలను వెలికి తీస్తామని ప్రకటన
హైదరాబాద్‌(జనంసాక్షి): ఔటర్‌ రింగు రోడ్డు టెండర్లపై విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఓఆర్‌ఆర్‌ పై విచారణ జరిపేందుకు సిట్‌ ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. సభ్యుల ఆమోదంతో విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఓఆర్‌ఆర్‌ టెండర్ల లీజుపై విచారణకు సిట్‌ ఏర్పాటు చేస్తామని, త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని అన్నారు. ఓఆర్‌ఆర్‌ పై జరపాలని హరీష్‌ రావు కోరడం అభినందనీయమని అన్నారు. ఓఆర్‌ఆర్‌ టెండర్లను ఎన్నికలకు హడావిడిగా, అప్పణంగా తక్కువ కట్టబెట్టారని విమర్శించారు. రూల్స్‌ లేకుండా హడావిడిగా అప్పనంగా ఎవరికో కట్టబెట్టారని, దేశం విడిచి పారిపోవాలనే ఓఆర్‌ఆర్‌ టెండర్లను అమ్ముకున్నారని బీఆర్‌ఎస్‌ నేతలపై సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు చేసిన ఆరోపణలకు అనుగుణంగా ఓఆర్‌ఆర్‌ టెండర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్‌ విచారణకు ఆదేశించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జైకా నుంచి నిధులు తెచ్చి ఓఆర్‌ఆర్‌ నిర్మించారు. దాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పన్నంగా టెండర్‌కు అప్పగించిందని ధ్వజమెత్తారు. ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్‌, ఐటీ కంపెనీలను తీసుకొచ్చి హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేసింది కాంగ్రెస్‌ అన్నారు. క్రిడెట్‌ అంతా కాంగ్రెస్‌కే దక్కుతుందని తెలిపారు. అంతేకాకుండా ప్రజల అవసరాలు తీర్చాలని కృష్ణ, గోదావరి నీళ్లు తేవడానికి పీజేఆర్‌ ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్సే అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ అంతర్జాతీయ నగరంగా మారడానికి కాంగ్రెస్‌ కారణమని వివరించారు. వేల కోట్ల ఓఆర్‌ఆర్‌ ఆస్తిని అప్పన్నంగా అమ్ముకున్నారని బీఆర్‌ఎస్‌పై రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు ఓడిరచబోతున్నారని తెలిసి.. అమ్మేసుకున్నారని ఆరోపించారు. దేశం విడిచిపెట్టి పోవాలనే ఉద్దేశంతోనే ఓఆర్‌ఆర్‌ ఆస్తులను గత ప్రభుత్వాధినేతలు అమ్మేసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హరీశ్‌రావు విచారణ కోరారు.. ఆయన కోరిక మేరకు సిట్‌ విచారణకు ఆదేశిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విధివిధానాలు కేబినెట్‌లో చర్చించి విచారణ చేయిస్తామన్నారు. ఆర్‌ఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సిట్‌ విచారణకు ఆదేశించడంపై హరీశ్‌రావు స్పందించారు. ఓఆర్‌ఆర్‌ టెండర్‌పై తాను విచారణ కోరలేదన్నారు. అయినా కూడా విచారణను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ముందు టెండర్‌ రద్దు చేసి విచారణకు ఆదేశించాలని కోరారు.

మా అప్పులు మీరు చేసిన అప్పుల వడ్డీలకే సరిపోతున్నాయి

` గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆర్థిక పరిస్థితి పెనుభారం
` ఆర్థికస్థితిపై స్వల్పకాలిక చర్చలో డిప్యూటి సిఎం భట్టి
` అప్పులపై సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: హరీశ్‌
` తనపై వస్తున్న ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని వెల్లడి
` వాడీవేడీగా అసెంబ్లీ సమావేశాలు
` సమాచారం లేకుండా ఆర్థికస్థితిపై చర్చ పెట్టారని విపక్షాల ఆక్షేపణ
తెలంగాణ అసెంబ్లీలో అప్పులు, వాటి చెల్లింపులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు. మొత్తం అప్పు 6 లక్షల 71 వేల కోట్లు ఉంది.. చేసిన అప్పులు సరిగా చెప్పలేదు.. సభను తప్పుదోవ పట్టించారని ప్రతిపక్షం తప్పు పట్టిందని అన్నారు. అంతేగాకుండా తాము చేసిన అప్పులకన్నా, వడ్డీలు కట్టడానికే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తోందని అన్నారు. ఏడాదిలో విూరు అప్పులు చేశారంటూ సభ్యులు ప్రశ్నించారు.. అప్పులపై హరీష్‌రావు అనేక ఆరోపణలు చేశారన్నారు. తాను చెప్పే వివరాలు తప్పని ఆర్బీఐ పేరుతో కొన్ని పత్రాలు చూపిస్తున్నారు.. ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్లు చెప్పడం హరీష్‌ రావుకు వెన్నతో పెట్టిన విద్య అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలు పెండిరగ్‌ బిల్లులే రూ.40వేల 150 కోట్లు పెట్టారు.. అప్పులు, పెండిరగ్‌ బిల్లులు కలిపితే రూ.7లక్షల 19వేల కోట్లు అని భట్టి విక్రమార్క తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక లక్ష కోట్లు అప్పు చేశామని.. తాము ఏం చేయలేదని ఆరోపిస్తున్నారని డిప్యూటీ సీఎం అన్నారు. ఏడాదిలో తాము చేసిన అప్పుల వివరాలను సభ దృష్టికి తీసుకొస్తున్నాం.. రూ.52 వేల 118 కోట్లు అప్పు చేశాం.. రూ. 26 వేల కోట్లు వడ్డీ చెల్లించామని తెలిపారు. రూ. 8855 కోట్లు అదనంగా ఆదాయం నుండి వచ్చింది కట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు. దుబారా ఎవరు ఖర్చు చేయలేదు.. 1 లక్ష 18 వేల 364 కోట్లు అప్పులకు చెల్లించాం.. తెచ్చిన అప్పుల కంటే? కట్టిన చెల్లింపులే ఎక్కువ అని అన్నారు. రూ. 40 వేల కోట్లు పెండిరగ్‌ బిల్లులు పెడితే.. రూ. 12 వేల కోట్ల బిల్లులు క్లియర్‌ చేశామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పదేళ్లు భోజనం సప్లై చేసే కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు.. దీంతో పిల్లలకి ముక్కిపోయిన బియ్యం సరఫరా చేస్తున్నారన్నారు. బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని భావించే తాము.. మెస్‌ ఛార్జీలను పెంచామని, కాస్మొటిక్‌ చార్జీలు పెంచామని తెలిపారు. ఇది తమ కమిట్‌మెంట్‌ అని భట్టి విక్రమార్క అన్నారు. ఆర్బీఐ రిపోర్ట్‌ అంటూ హరీష్‌ చెప్తున్నారు.. 2024లో 3లక్షల 88 వేల కోట్లు హరీష్‌ పెట్టిన బడ్జెట్‌ వివరాలే ఆర్బీఐ పేరుతో చెప్తున్నారన్నారు. బడ్జెట్‌లో పెట్టిన అంశాలే ఆర్బీఐ చెప్తుంది.. ఆర్బీఐ కొత్తగా అడిట్‌ చేయదని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్ర బ్జడెట్‌ వివరాలతోనే ఆర్బీఐ వివరాలు చెప్తుంది.. హరీష్‌ రావు చెప్తున్న వివరాలు..ఆయన పెట్టిన బడ్జెట్‌ పత్రాల లోనివేనని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అయితే భట్టి ఆరోపణలపై మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి సంవత్సరమే రూ.1.25 లక్షల కోట్ల అప్పు చేసిందని భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్‌ విసిరారు. ‘భూములు కుదువపెట్టి అప్పులు తీసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రూ.75 కోట్లకు ఎకరం చొప్పున టీజీఐఐసీ భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. భారాస ప్రభుత్వం కూడా మెస్‌ ఛార్జీలు పెంచింది. వ్యవసాయ యంత్ర పరికరాలకు రాయితీ నిధులు ఇచ్చాం. ఈ ప్రభుత్వం తొలి ఏడాదే రూ.1.25 లక్షల కోట్ల అప్పు చేసింది. ఈ లెక్కన అప్పులు చేస్తే ఐదేళ్లలోనే గత ప్రభుత్వ అప్పును మించిపోతారు. మేం పదేళ్లలో రూ.7లక్షల కోట్లు అప్పు చేస్తే.. వీళ్ల అప్పు ఐదేళ్లలోనే రూ.7 లక్షల కోట్లు దాటిపోతుంది. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం పరంగా చూస్తే.. మేం కూడా మిగులు బ్జడెట్‌ రాష్టాన్నే అప్పగించాం. రూ.2.93 లక్షల కోట్ల బ్జడెట్‌తో రాష్టాన్ని కాంగ్రెస్‌కు అప్పగించాం. రాష్ట్ర సొంత ఆదాయం రూ.35 వేల కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు పెంచాం. కరోనా వల్ల, కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్టాన్రికి ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గడం వల్ల రాష్ట్రంపై కొంత అప్పుల భారం పడిరదని హరీశ్‌రావు వివరించారు.
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం : హరీశ్‌రావు
మెస్‌ ఛార్జీలు, రైతు బీమా, వ్యవసాయ యంత్ర పరికరాలకు డబ్బులు ఇవ్వలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని భట్టి విక్రమార్కకు హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. రాష్ట్ర రుణాలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా శాసనసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఛాలెంజ్‌ వేస్తున్నా.. భట్టి విక్రమార్క మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే.. నేతి బీరకాయలో నెయ్యి ఎంతనో భట్టి మాటల్లో నీతి అంత ఉంది. ఉట్టిఉట్టిగా మాట్లాడట్లేదు. రాజీనామా లేఖను స్పీకర్‌ ఫార్మాట్‌లో ఇస్తాను. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా మెస్‌ ఛార్జీలు పెంచింది. వ్యవసాయ యంత్ర పరికరాలకు రాయితీ నిధులు ఇచ్చాం. నేను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధం. ఒక వేళ ఇచ్చి ఉంటే భట్టి విక్రమార్క రాజీనామా లేఖను సీదా గవర్నర్‌ గారికి ఇస్తారా..? అని స్పీకర్‌ ద్వారా హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి సంవత్సరము రూ. 1.27 లక్షల కోట్ల అప్పు చేసింది. ఈ లెక్కన అప్పులు చేస్తే ఐదేండ్లలోనే గత ప్రభుత్వ అప్పును మించిపోతారు. మేం పదేండ్లలో రూ. 7 లక్షల కోట్లు అప్పు చేస్తే.. వీళ్ల అప్పు ఐదేండ్లలోనే రూ. 7 లక్షల కోట్లు దాటిపోతోంది. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం పరంగా చూస్తే.. మేం కూడా మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్నే అప్పగించాం. రూ. 2.93 లక్షల కోట్ల బడ్జెట్‌తో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు అప్పగించాం. రాష్ట్ర సొంత ఆదాయం రూ. 35 వేల కోట్ల నుంచి రూ. 1.50 లక్షల కోట్లకు పెంచాం. కరోనా వల్ల, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గడం వల్ల రాష్ట్రంపై కొంత అప్పుల భారం పడిరది. కానీ కొన్ని పాత అప్పులను కూడా ఈ ప్రభుత్వం మా ఖాతాలో వేసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేయని అప్పులను మేం చేసినట్లు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసింది రూ. 4.17 లక్షల కోట్ల అప్పు మాత్రమే. రూ. 4.17 లక్షల కోట్ల అప్పును రూ. 7 లక్షల కోట్ల అప్పు అని తప్పుడు ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఏడాది కాలంలోనే రూ. 1.27 లక్షల కోట్ల అప్పు చేసింది. ఏడాదిలో రూ. 1.27 లక్షల కోట్ల అప్పు చేస్తే.. వచ్చే ఐదేండ్లలో ఎంత చేస్తారు..? భూములు కుదువపెట్టి అప్పులు తీసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రూ. 75 కోట్లకు ఎకరం చొప్పున టీజీఐఐసీ భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఆర్థికస్థితిపై చర్చ పట్ల విపక్షాల అసహనం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. సభ కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదని విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. శాసనసభ నడుపుతున్న తీరుపై విపక్షాలు ఆక్షేపించాయి. సమాచారం లేకుండా ఆర్థిక పరిస్థితిపై చర్చ పెట్టారని విమర్శించాయి. శాసనసభ నిబంధనల ప్రకారం సభ నిర్వహించాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌.. స్పీకర్‌ దృష్టికి తెచ్చారు. శాసనసభ నడిపే తీరు ఇది కాదని భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సభ్యులకు సమాచారం లేకుండా ఎలా మాట్లాడతారని భాజపా పక్షనేత మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విపక్ష, అధికార సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి.. సభలో గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యుల విమర్శలపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. సభ నిర్వహణలో కొంత సమాచార లోపం జరిగింది… దీనికే స్పీకర్‌ సారీ చెబుతారా? అని మండిపడ్డారు. స్పీకర్‌ కార్యాలయం తీసుకునే నిర్ణయాలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. విపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి సమాచార లోపానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు.‘హరీశ్‌రావు, అక్బరుద్దీన్‌.. ఇద్దరూ సీనియర్‌ సభ్యులు. సమాచార లోపం జరిగిందని మేమే చెబుతున్నాం. అయినా క్షమాపణ చెప్పాలంటున్నారు. వారు ఏదైనా చెప్పాలనుకుంటే రిక్వెస్ట్‌ చేయాలి. అంతేకానీ హుకుం జారీ చేయొద్దు. తప్పు చేస్తే తప్పకుండా క్షమాపణ చెబుతాం. ఎంతో ముఖ్యమైన అంశంపై సభలో చర్చ కొనసాగుతుండగా.. చర్చను పక్కదారి పట్టించేందుకే ఇదంతా చేస్తున్నారు. సభ సజావుగా జరగాలని భారాస నేతలు భావించడం లేదు. ప్రభుత్వ పరంగా ఏదైనా పొరపాటు జరిగితే శాసనసభ వ్యవహారాల మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా.. జవాబుదారీగా ఉంటా. అంతేకానీ స్పీకర్‌ క్షమాపణ చేప్పాలంటే.. ఎలా సాధ్యం అవుతుందని శ్రీధర్‌బాబు అన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు రెండేళ్లలో పూర్తి చేస్తాం
` మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు రూ.37 కోట్లు విడుదల చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ వారంలో మరో రూ.22 కోట్లు విడుదల చేస్తామన్నారు.అన్ని ప్రాజెక్టులను పద్ధతి ప్రకారం పూర్తి చేస్తున్నట్లు ఉత్తమ్‌ చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. రెండేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కాస్ట్‌ బెనిఫిట్‌ రేషియో చూసుకుని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ కాల్వకు రూ.120 కోట్లు మంజూరు చేశామని.. త్వరలో టెండర్లు పిలుస్తామని ఉత్తమ్‌ పేర్కొన్నారు. మరోవైపు భారాస సభ్యులు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. సభ ఆమోదం పొందని భూ భారతి బిల్లును చట్టంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. సభ్యుల హక్కులకు భంగం కలిగించేలా వ్యహరించారంటూ నోటీసులు ఇచ్చారు. శాసనసభ్యుల హక్కులను పరిరక్షించాలని సభాపతిని కోరారు.