భూ భారతి బిల్లుకు శాసనసభ ఆమోదం

వాడీవేడి చర్చ అనంతరం సభ తీర్మానం
ధరణిపై సిబిఐ విచారణకు బిజెపి డిమాండ్‌
ప్రతి సమస్యా భూమితో ముడిపడి ఉంది
భూమికోసం ఎన్నో పోరాటాలు సాగాయి
ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి
ధరణితో విదేశీ కంపెనీల చేతికి వివరాలు
సభలో సిఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి
బిఆర్‌ఎస్‌ సభ్యుల తీరుపై ఆగ్రహం
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీలో భూభారతి బిల్లు – 2024 ఆమోదం పొందింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు. భూ భారతి బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. బిల్లు ఆమోదం పొందుతుండటంతో ఆనంద భాష్పాలు వస్తున్నాయన్నారు. సభలో భూ భారతి బిల్లు ప్రవేశ పెట్టిన మంత్రి..బిల్లును పాస్‌ చేయాల్సిందిగా స్పీకర్‌ ను కోరారు. సభ్యులు ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం అసెంబ్లీని స్పీకర్‌ శనివారానికి వాయిదా వేశారు. భూభారతిపై చర్చ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని అన్నారు. తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి. భూమిని కాపాడుకునే ప్రయత్నంలో దొడ్డి కొమరయ్య వంటి వారు ప్రాణాలు కోల్పోయారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది భూ పోరాటాలు చేశారు. పేదల భూములు కాపాడేందుకు పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. భూమిలేని పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వ భూమి ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టింది. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గత ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయని అన్నారు. భూభారతిపై వాడీవేడిగా చర్చ సాగింది. బిల్లుపై విపక్ష బిఆర్‌ఎస్‌ సభ్యులు చర్చించకుండా ఆందోళనకు దిగారు. బిల్లుపై చర్చించాలని, ఇది రైతులకు సంబంధించినదని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పదేపదే సూచించారు. భూముల అన్యాక్రాంతం, లక్షల కోట్ల అవినీతి జరిందని డిప్యూటి సిఎం భట్టి, మంత్రి పొంగులేటి ప్రకటించినా ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశించలేదని బిజెపి నేతమహేశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సహనం కోల్పోయి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ పట్ల దారుణంగా వ్యవహరించారని అన్నారు. అమర్యాదగా ప్రవర్తించి సభాపతిపైనే పేపర్లు విసిరారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రతిపక్షం వ్యవహార శైలి, ధరణి పోర్టల్‌, కేసీఆర్‌, ఫార్ములా-ఈ కార్‌ రేసుపై సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తనపై దారుణంగా ప్రవర్తించినా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ మాత్రం సహనాన్ని ప్రదర్శించారని ఆయన అన్నారు. ప్రతిపక్షం అహంభావంతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన ’ధరణి’ మాత్రం రైతులను తమ భూములకు దూరం చేసింది. 2010లో ఒడిశా కూడా ఇదే ధరణి విధానాన్ని తీసుకొస్తే.. ఒడిశా ప్రభుత్వం తప్పు చేసిందని ఎన్‌ఐసీ, కాగ్‌ సూచించాయి. అనుభవం లేని ఐ అండ్‌ ఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థకు అప్పగించొద్దని హెచ్చరించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం యువరాజుకు అత్యంత సన్నిహితుడైన గాదె శ్రీధర్‌రాజు కంపెనీకి ధరణి పోర్టల్‌ నిర్వహణను అప్పగించారు. క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కున్న సంస్థలను ఐఎల్‌ అండ్‌ ఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ టేకోవర్‌ చేసుకుంది. అవకతవకలకు పాల్పడిన సంస్థకు ధరణి పోర్టల్‌ బాధ్యతను అప్పగించారు. ధరణి టెండర్‌ దక్కగానే ఈ సంస్థ పేరు, యాజమాన్యం మారింది. ఫాల్కన్‌ హెచ్‌బీ అనే ఫిలిప్పీన్‌ కంపెనీ, తర్వాత సింగపూర్‌ కంపెనీ ఇందులోకి వచ్చాయి. 50 లక్షల మంది రైతులు, వారి భూముల వివరాలను ఈ సంస్థ చేతిలో పెట్టారు. ట్యాక్స్‌ హెవెన్‌ దేశాల కంపెనీల చేతిలో మన ధరణి పోర్టల్‌ పెట్టారు. ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, కెమెన్‌ హైలాండ్స్‌, వర్జీన్‌ ఐలాండ్‌ విూదుగా ధరణి పోర్టల్‌ తిరిగింది. పోర్టల్‌ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్లినా.. సీఈవోగా గాదె శ్రీధర్‌రాజే ఉన్నారు‘ అని సీఎం వివరించారు. సీఎం ప్రసంగం తర్వాత భూ భారతి బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. విపక్ష పార్టీ అహంభావంతో అహంకారంతో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సభా మర్యాదలను ఉల్లంఘించి సభాపతిపైనే దాడి చేస్తామన్న ధోరణిలో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించిందన్నారు. ‘రెచ్చగొట్టడం ద్వారా భూ భారతి బిల్లుపై చర్చను పక్కదోవ పట్టించాలని ప్రయత్నించినా.. చాలా ఓర్పుతో సభాపతి వ్యవహరించారు. ఏ మాత్రం సహనం కోల్పోకుండా.. వాళ్లంతట వాళ్లే సహనం చచ్చిపోయి సహకరించాల్సిన పరిస్థితి కల్పించి సభను ముందుకు నడిపించారు. తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడే కీలకమైన, ముఖ్యమైన బిల్లుపై చర్చ జరిగే విధంగా కృషి చేసిన సభాపతిని అభినందిస్తున్నా‘ అని సీఎం తెలిపారు. అద్భుతమంటూ ధరణి పోర్టల్‌ తీసుకొచ్చారని, ధరణి గురించి గత ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారని, కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆ పోర్టల్‌ను కేసీఆర్‌ కనిపెట్టలేదని, 2010లోనే ఒడిశా ప్రభుత్వం ఈ-ధరణిని తీసుకొచ్చిందని సీఎం వెల్లడిరచారు. ఒడిశా తెచ్చిన ధరణిలో లోపాలు ఉన్నాయని కాగ్‌ చెప్పిందని, కాగ్‌ తప్పుబట్టిన ధరణిని తెలంగాణలో ఎందుకు పెట్టారని అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ను రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ తనకంటే గొప్పోళ్లు లేరని అనుకుంటారని, అందుకే ఆయన అలా ప్రవర్తిస్తారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ’కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులకే ధరణి టెండర్లు కేటాయించారు. సత్యం రామలింగరాజు సంస్థలతో ఉన్న బంధంతోనే ధరణి పోర్టల్‌ తీసుకొచ్చారు. ధరణి నిర్వహణలో మన రాష్ట్ర పౌరులు ఎవరూ లేరు. కనీసం పక్క రాష్టాల్రకు చెందిన వారూ లేరు. టీఎస్‌టీఎస్‌ ఆధ్వర్యంలోనే ధరణి టెండర్లు వేశారు. ఐటీ శాఖ పరిధిలోనే టీఎస్‌టీఎస్‌ ఉంటుంది. ఆర్థిక నేరాలు చేసిన కంపెనీల ద్వారా డేటాను దేశం దాటించారు. ప్రజలను మోసం చేసి సమాచారాన్ని క్రిమినల్స్‌కు అందించారు. ఈ నేరాలకు ఏం శిక్ష విధించాలో తెలియాలంటే చట్టాలన్నీ చదవాలి. ధరణిలోకి డజన్ల కొద్దీ కంపెనీలు ఎందుకు వచ్చాయి?. మన భూముల సమాచారం మొత్తం విదేశాల్లో ఉంది. రెవెన్యూ శాఖ, సీఎం దగ్గర ఉండాల్సిన సమాచారం విదేశాలకు వెళ్లింది. ఇన్ని అవకతవకలు ఉన్నా అద్భుతమంటూ ఎన్నికల్లో మాట్లాడారు. ఇవన్నీ మేము గత ఎన్నికల ముందే చెప్పాం. ధరణిలో మార్పులు చేయాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించి కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. ధరణి పేరుతో వాళ్ల అరాచం, దుర్మార్గం చెప్పలేని స్థాయికి చేరింది. అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచార సేకరణ నేరం. గాదె శ్రీధర్‌రావు ద్వారా విదేశాలకు సమాచారం పంపించారు. వాళ్లు ఒక్క క్లిక్‌ కొడితే సమాచారం మొత్తం నాశనమవుతుంది. మన దగ్గర ఉన్న సర్వర్లూ క్రాష్‌ అవుతాయి. అందుకే విచారణకు ఇవ్వడంపై ఇంతకాలం ఆలోచన చేశాం. విదేశాలకు వెళ్లి వివరాలు ఇవ్వాలని కోరినా సహకరించలేదన్నారు.
బిఆర్‌ఎస్‌ సభ్యుల తీరుపై మండిపడ్డ మంత్రి పొంగులేటి
గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా భారాస సభ్యులు వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. శాసనసభలో భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఫార్ములా ఈ-రేసు అంశంపై చర్చకు భారాస సభ్యులు పట్టుబట్టడంతో పాటు స్పీకర్‌ పోడియం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారి ఆందోళనల మధ్యే భూ భారతి బిల్లుపై పొంగులేటి తన ప్రసంగాన్ని కొనసాగించారు.‘భారాస సభ్యులు భూ భారతి బిల్లును ఆమోదించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి తీరు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉంది. సభలో గూండాగిరి, దౌర్జన్యం, రౌడీయిజం లేకుండా స్పీకర్‌ చర్యలు చేపట్టాలి. భారాస హయాంలో తీసుకొచ్చిన ’ధరణి’ పోర్టల్‌ తప్పులతడకగా ఉందని కేసీఆర్‌కు తెలుసు. ఆయన 80వేల పుస్తకాలు చదివారు. పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించి ధరణి పోర్టల్‌ రూపొందించారని అనుకునేవాళ్లం. ఆ చట్టానికి మూడేళ్లకే వందేళ్లు నిండాయి. ఇందిరమ్మ రాజ్యంలో 1971లో చేసిన చట్టం.. 49 ఏళ్లుగా ప్రజల్లో ఉంది. భూ భారతి బిల్లుకు సంబంధించి భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అనేక సూచనలు ఇచ్చారు. ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ కూడా సూచనలు చేస్తారని ఆశించాం. అవి చట్టంలో పొందుపరచాలని భావించాం. కేసీఆర్‌ రాలేదు.. సభలో ఉన్నవాళ్లు ఈరకంగా గొడవ చేస్తున్నారు. భారాస చిల్లర వేషాలను ప్రజలు హర్షించరు‘ అని పొంగులేటి వ్యాఖ్యానించారు.అంతకుముందు హరీశ్‌రావు తీరుపై స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారాస సభ్యుల ఆందోళన సందర్భంగా స్పీకర్‌ మాట్లాడారు. ‘హరీశ్‌రావు తీరు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసేలా ఉంది. సభను తప్పుదోవ పట్టించడం సరికాదు. భూ భారతి ముఖ్యమైన బిల్లు. ప్రజలకు సంబంధించిన బిల్లులపై చర్చల సమయంలో ఇలా ప్రవర్తించడం సరికాదు. ఈ బిల్లు ఇష్టం లేదా? రైతులకు సాయం చేయడం ఇష్టం లేదా?‘అని స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

రూ. 600 కోట్ల దోపిడికే ఫార్ములా ఈ-రేస్‌
` సంబంధిత సంస్థతో కేటీఆర్‌ లోపాయికారీ ఒప్పందం
` ఈ వ్యవహారంపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం
` బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌
` విచారణలో ఉన్నందున వివరాలు వెల్లడిరచలేను
` సభలో ముఖ్యమంత్రి వివరణ
హైదరాబాద్‌,డిసెంబర్‌20(జనంసాక్షి):ఈ-ఫార్ములా సంస్థతో జరిగిన కేటీఆర్‌ లోపాయికారీ ఒప్పందం అంతా ప్రజల ముందు పెడతానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో కేటీఆర్‌ ఈ-ఫార్ములా కేసుపై సీఎం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ బీఏసీ విూటింగ్‌లో 9 అంశాలు ఇచ్చారు.. దీంట్లో ఈ ఫార్ములా గురించి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ ఫార్ములా ప్రతినిధి తనను కలిశారని.. ఎవరు వచ్చినా అందరినీ కలుస్తానని చెప్పారు. ఈ ఫార్ములా ప్రతినిధిని తన ఇంట్లో కలిశానని అన్నారు. తనకేం సంబంధం అని అడిగానన్నారు. కేటీఆర్‌తో అంత సెటిల్‌ చేసుకున్నానని ఫార్ములా ప్రతినిధి అన్నారు.. అధికారులతో మాట్లాడి చెప్తా అన్నానని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ-కార్‌ రేస్‌ ప్రతినిధి తనను కలవడంతోనే ఈ బండారం బయటపడిరదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏసీబీ విచారణలో ఉన్నందున ఇప్పుడు పూర్తి వివరాలు చెప్పలేనని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఇక్కడ తానేం చెప్పినా కోర్టుకు వెళ్లి సీఎం తన విూద కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు చెప్పుకుందాం అనుకుంటున్నారని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ ఫార్ములా సంస్థతో జరిగిన కేటీఆర్‌ లోపాయికారీ ఒప్పందం అంతా ప్రజల ముందు పెడతానని పేర్కొన్నారు. వెంటనే విచారణ జరపాలని.. అధికారులకు సూచించానన్నారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు సభ జరిగింది.. కానీ దీని గురించి చర్చకి అడగలేదని అన్నారు. ట్విట్టర్‌ పిట్ట ఇన్నాళ్లు ఎక్కడ పోయాడు.. బీఆర్‌ఎస్‌ వాళ్లకు మెదడు కూడా పోయినట్టు ఉందని సీఎం దుయ్యబట్టారు. ఎక్కడికైనా వస్తా.. చర్చ చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అవసరం అనుకుంటే వాళ్ల పార్టీ ఆఫీస్‌ కి ఐనా వెళ్తానని తెలిపారు. హెచ్‌ఎండీఏ ఖాతాలోని డబ్బులు లండన్‌ కంపెనీకి ఎలా వెళ్ళాయని సీఎం అడిగారు. ఈ- కార్‌ రేస్‌ అగ్రిమెంట్‌ రూ.55 కోట్లు కాదు.. రూ.600 కోట్లు అని ముఖ్యమంత్రి తెలిపారు. రూ. 600 కోట్లు లూటీ చేయాలని ఫార్ములా ఈ-రేస్‌ తెచ్చారని సీఎం పేర్కొన్నారు. నగదు బదిలీ చేయాలంటే ఆర్బీఐ అనుమతి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఓఆర్‌ఆర్‌ టెండర్లు రద్దు చేయండని అంటున్నారు.. విచారణ జరగకుండా రద్దు చేస్తారా..? అని సీఎం ప్రశ్నించారు. విచారణ అడిగింది వాళ్ళే.. డిమాండ్‌ చేసింది వాళ్ళేనని సీఎం తెలిపారు. చర్చకు నేను వెనక్కి పోయే వాడినా అధ్యక్షా.. దేని విూద నైనా చర్చకు సిద్ధంగా ఉంటానని ముఖ్యమంత్రి చెప్పారు. హరీష్‌ రావు అడిగితేనే ఓఆర్‌ఆర్‌ పై సిట్‌ వేశామన్నారు. ఈ విషయంపై కేసీఆర్‌ ఇంట్లో గొడవ జరిగిందని తెలిపారు. ఇంటికి వెళ్లాక హరీష్‌ కు కొరడా దెబ్బలు ఉంటాయన్నారు. హరీష్‌ బాధను తాను అర్ధం చేసుకుంటానని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.