హౖకోర్టులో కేటీఆర్‌కు స్వల్ప ఊరట

` 30 వరకు అరెస్ట్‌ చేయొద్దన్న ధర్మాసనం
` క్వాష్‌ పిటీషన్‌పై విచారణ
` కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చు
` పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
` తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా
హైదరాబాద్‌(జనంసాక్షి): భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా`ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని కేటీఆర్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది.ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సుందరం, ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని కోరారు.ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 27కి వాయిదా వేసింది.
కేటీఆర్‌ తరఫు న్యాయవాదుల వాదనలు ఇలా..
’’అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. ముఖ్యంగా 13(1)(జీ) సెక్షన్‌ ఈ కేసుకు వర్తించదు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవు. ప్రొసీజర్‌ పాటించలేదనడం సరైంది కాదు. 14 నెలల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారు. కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే కేటీఆర్‌పై కేసు పెట్టారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. కార్‌ రేస్‌ నిర్వహణకు 2022 అక్టోబరు 25న ఒప్పందం జరిగింది. సీజన్‌ 10 నిర్వహణకు స్పాన్సర్‌ వెనక్కి తగ్గారు. రేస్‌ నిర్వహణలో ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇబ్బందులు రాకూడదనే హెచ్‌ఎండీఏ చెల్లింపులు చేసింది.సీజన్‌`9 వల్ల దాదాపు రూ.700 కోట్ల లాభం వచ్చింది. ఆర్థికశాఖ అనుమతి లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. కార్‌ రేసింగ్‌ ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించింది. కొత్త ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దయింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఆలస్యానికి కారణాలు చెప్పలేదు. సుప్రీం తీర్పుల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఆలస్యం తగదు. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులను ఏసీబీ అధికారులు పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధిపై కేసుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలి. 18న ఫిర్యాదు అందగానే.. 19న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేటీఆర్‌ స్పెక్యులేషన్‌ చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు’’ అని కేటీఆర్‌ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.
కేటీఆర్‌ పాత్ర ఏంటో దర్యాప్తులో తేలుతుంది: ఏజీ
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘’ఎఫ్‌ఐఆర్‌ నమోదు ప్రాథమిక అంశం మాత్రమే. అందులో పేర్కొన్న అంశాలే అంతిమం కాదు. దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తారు. రెండు నెలల క్రితమే కేసు నమోదుకు నిర్ణయించారు. కేసు నమోదు కోసం గవర్నర్‌ నిర్ణయానికి పంపారు. గవర్నర్‌ ఆమోదించాకే కేసు నమోదు చేశారు. ఫార్ములా సంస్థకు డబ్బు విదేశీ కరెన్సీలో చెల్లించారు. దీంతో హెచ్‌ఎండీఏపై అధిక భారం పడిరది. విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం ఆర్‌బీఐ అనుమతి తీసుకోలేదు. ఆర్థికశాఖ అనుమతి కూడా లేదు’’ అని ఏజీ వివరించారు.గవర్నర్‌ అనుమతి కాపీని కోర్టు అడగడంతో ఏజీ అందజేశారు. చెల్లింపుల్లో కేటీఆర్‌ పాత్ర ఏంటని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. కేటీఆర్‌ పాత్ర ఏంటో దర్యాప్తులో తేలుతుందని ఏజీ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు అనేది దర్యాప్తు కోసమేనని వివరించారు. కేసు పూర్తి వివరాలు అభియోగపత్రంలో ఉంటాయని, రూ.56 కోట్లకు పైగా చెల్లింపుల్లో నిబంధన ఉల్లంఘన జరిగిందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు.అంతకు ముందు తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా-ఈ రేస్‌ వ్యవహారంలో ఏసీబీ కేసుపై క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఈ మేరకు కేటీఆర్‌ తరఫు లాయర్లు జస్టిస్‌ శ్రవణ్‌ కుమార్‌ బెంచ్‌ ముందు లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత పిటిషన్‌ను విచారించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారించనుంది. కాగా, లంచ్‌ మోషన్‌ను సింగిల్‌ బెంచ్‌ తిరస్కరించడంతో.. సీజే బెంచ్‌ ముందు పిటిషన్‌ను దాఖలు చేశారు. కాంగ్రెస్‌ సర్కార్‌ కుటిల ప్రయత్నంతో ఫార్ములా ఈ-కార్‌ రేసులో కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఈ-కార్‌ రేసింగ్‌లో రూ.54.88 కోట్లు దుర్వినియోగం చేశారనే అభియోగంతో కేటీఆర్‌పై ఎంఏయూడీ సెక్రటరీ దానకిశోర్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్‌పై ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. ఎన్నికల నియమావళిని ధిక్కరిస్తూ, ప్రభుత్వ అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా రూ.54,88,87,043 కోట్లను యూకేకు చెందిన ‘ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ లిమిటెడ్‌’ (ఎఫ్‌ఈఓ) కంపెనీకి హిమాయత్‌నగర్‌ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు నుంచి బదిలీ చేయించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్‌, ఏ2గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఐసీపీ (బీఎన్‌ఎస్‌) 13(1)(ఏ), 13(2), సీపీయాక్ట్‌ 409, 120 (బీ) సెక్షన్స్‌ కింద అభియోగాలు మోపారు. ఈ మేరకు నాంపల్లి ఏసీబీ కోర్టుకు ఏసీబీ అధికారులు వివరణ ఇచ్చారు. రూ.10 కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్థికశాఖ అనుమతి అవసరమని, సీజన్‌ 10 ఫార్ములా ఈ రేసింగ్‌కు స్పాన్సర్స్‌ లేక పోవడంతో హెచ్‌ఎండీఏ నిధులు మళ్లించారని, దీంతో విదేశీ కంపెనీకి చెల్లింపులతో హెచ్‌ఎండీఏకు అదనపు పన్ను భారమైందని దానకిశోర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫార్ములా ఈ`రేసు కేసు.. రంగంలోకి ఈడీ
హైదరాబాద్‌(జనంసాక్షి): ఫార్ములా ఈ`రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. ఈ మేరకు ఏసీబీకి లేఖ రాశారు. వివరాలు అందగానే ఈడీ మనీలాండరింగ్‌ కేసును నమోదు చేయనుంది.