నీటి కేటాయింపులపైపొన్నాలను ప్రశ్నించిన సిబిఐ

హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి): ఇందిరా సిమెంట్స్‌, భారతి సిమెంట్స్‌కు అక్రమ నీటి కేటాయింపుపై విచారణ జరుపుతున్న సిబిఐ గురువారంనాడు అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను  విచారించింది. ఉదయం 10.30గంటలకు పొన్నాల సిబిఐ ఎదుట హాజరయ్యారు. జగన్‌ ఆస్తుల కేసులో ఈ విషయం కూడా ఒక ప్రధానాంశంగా మారింది. సాగునీటి నిపుణుల సూచనలు సైతం బేఖాతరు చేస్తూ ఆ కంపెనీలకు కృష్ణానది నీటిని కేటాయించడంపై సిబిఐ పలు రకాలుగా పొన్నాలను ప్రశ్నించినట్టు సమాచారం.  పొన్నాల తీసుకున్న నిర్ణయం వల్ల జగన్‌ సంస్థల్లోకి ఆ కంపెనీలు దాదాపు 5వేల కోట్ల రూపాయలు వాటాలు  పెట్టినట్టు సిబిఐ గుర్తించడంతో పొన్నాలను లోతుగా దీనిపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. పొన్నాల కూడా వైఎస్‌ మంత్రివర్గం నిర్ణయం మేరకే తాను ఈ జీవో ఇచ్చినట్టుగా సిబిఐకి సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ప్రకృతి వనరులను స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించడం తప్పు కాదా అంటూ ఆయనను సిబిఐ గుచ్చి గుచ్చి అడిగినట్టు సమాచారం. ఇందిరా సిమెంట్సుకు 10 లక్షల గ్యాలన్ల నీటిని ఒకేరోజు కేటాయిస్తూ జీవో ఇవ్వడాన్ని  సిబిఐ తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ఈ జీవోలు ఇవ్వడం తప్పు కాదా అంటూ సిబిఐ ప్రశ్నించినట్టు సమాచారం. ఏదేమైనా పొన్నాలను అరెస్టు చేస్తారా.. లేదా.. సాక్షిగా చూపుతారా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.