నెలాఖరులోగా పూర్తి చేయండి

హైదరాబాద్‌, జూన్‌ 30: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయితీ భవనాలను, మండల సమాఖ్య భవనాలను జూలై చివరి నాటికి పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి ఆదేశించారు. చేవెళ్ల మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేవెళ్ల డివిజన్‌ బిఆర్‌జిఎఫ్‌, మండల నిధులు, జనరల్‌ నిధుల పనులను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కొన్ని గ్రామ పంచాయితీలలో పంచాయతీ నిధుల ద్వారా మరమ్మత్తులు చేయాల్సిన బోర్లను మరమ్మత్తులు చేయకుండానే పేమెంట్లు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతీ మండల స్థాయిలో ఎరువులు, విత్తనాలు సక్రమంగా అందుతున్నది లేనిది తహశీల్దార్లు, ఎంపిడివోలు సంబంధిత కేంద్రాలను సందర్శించి ఏవైనా ఇబ్బందులుంటే తనకు తెలియజేయాలని అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమయినప్పటికీ కొన్ని మండలాల్లో పాఠ్యపుస్తకాలు సరఫరా కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే ఆయా పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాములు సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు.