నేడు యాదవ చైతన్య జిల్లా సదస్సు
ఆదిలాబాద్,ఫిబ్రవరి14(జనంసాక్షి):
అఖిలభారత యాదవ సేవాసంఘం ఆధ్వర్యంలో యాదవ చైతన్య జిల్లా సదస్సును ఆదివారం నిర్వహిస్తున్నారు. ఉదయం 10గంటలకు యోగాభవన్‌లో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం జిల్లా అధ్యక్షుడు తెలిపారు. జాతీయఅధ్యక్షులు దాసరి అజయ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈసదస్సుకు జిల్లాలోని యాదవ బంధువులు అధికసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. అలాగే భట్రాజు జిల్లా సంఘం ఎన్నికలు ఆదివారం నిర్మల్‌లోని పీఆర్‌టీయూ భవన్‌లో నిర్వహించనున్నట్లు ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరామరాజు తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్మల్ నియోజకవర్గం, మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఇక గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న తుడుందెబ్బ జిల్లా స్థాయి సమావేశాన్ని ఈనెల 21న నిర్వహించుకుంటోంది. వివిధ సమస్యలు, హక్కులపై చర్చించి పోరాట కార్యాక్రమాలను రూపొందించుకునే క్రమంలో ఉట్నూర్‌లోని ఆదివాసీ భవన్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా నాయకులు చెప్పారు. సమావేశానికి జిల్లాలోని ఆదివాసీ హక్కుల పోరా సమితి, తుడుందెబ్బ నాయకులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొంటారు. అలాగే ఎంసీపీఐ (భారత మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)) రాష్ట్ర ప్రథమ మహాసభలు ఈనెల 23 నుంచి 25 వరకు బెల్లంపల్లిలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రథమ మహాసభ గోడప్రతులను ఆవిష్కరించారు.