కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింత
` అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్
` అనితినీతిని బయపటెపెట్టేందుకు కమిషన్ వేశాం
` ఎవరినీ వదలం.. నిర్ణయం తీసుకున్నాకే ఇక్కడి నుంచి కదులుతామని వెల్లడి
` అబద్ధపు వ్యాఖ్యలతో హరీశ్‌రావు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
` డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు: మంత్రి ఉత్తమ్
` ప్రాజెక్టుపై శాసనసభలో వాడీ వేడి చర్చ..
హైదరాబాద్(జనంసాక్షి):కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకలను విచారించడానికి తెలంగాణ కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం అసెంబ్లీలో ప్రకటన చేశారు. అబద్ధపు వ్యాఖ్యలతో మాజీ మంత్రి హరీశ్‌రావు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడీగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. ప్రాణహిత-చేవెళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయని అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతి చెప్పారని గుర్తు చేశారు. 2015లో కేంద్ర మంత్రి తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖను సభలో చదివి వినిపించారు. ‘‘ హైడ్రాలజీ క్లియరెన్స్ ఉందని, ప్రాణహిత-చేవెళ్ల కట్టుకోవచ్చని ఆనాడు ఉమాభారతి లేఖలో పేర్కొన్నారు. కానీ, దురాశ, దోపిడీతో మళ్లీ విచారణ చేయాలని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కోరింది. కేంద్ర రాసిన లేఖను మళ్లీ పరిశీలించాలని అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను కోరారు.ప్రాజెక్టు కట్టుకోవాలని 2009లో కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది. అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్‌రావు మొత్తం వ్యవస్థల్ని తప్పుదోవపట్టించారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పేజీ నెంబరు 98లో పేర్కొంది. వాస్తవాలను బయటపెట్టారనే జస్టిస్ ఘోష్ కమిషన్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. ఏ విచారణ కావాలో చెప్పకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని హరీశ్‌రావు పదే పదే చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలను రికార్డులను తొలగించాలి. నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2009, 2014లో లేఖలు రాశారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు ఉన్నాయని చెప్పినా మీరెందుకు వినలేదు. మహారాష్ట్రతో చర్చ జరిగింది ప్రాజెక్టు ఎత్తు గురించే. ముంపు ప్రాంతం తగ్గుతుందనే ఎత్తు తగ్గించుకోవాలని మహారాష్ట్ర కోరింది. తెలంగాణ ప్రజల సొమ్ము రూ.లక్ష కోట్లు దోచుకునేందుకే ఇలా చేశారు. కేసీఆర్‌కు నిజాం కంటే శ్రీమంతుడు కావాలని దుశార కలిగిందేమో. మేడిగడ్డ వద్దే కట్టాలని అప్పటికే కేసీఆర్, హరీశ్‌రావు నిర్ణయం తీసుకున్నారు’’ అని సీఎం అన్నారు. కేంద్ర మంత్రి ఉమా భారతి రాసిన లేఖలో మొదటి పేజీ మాత్రమే చదివారు.. 3వ పేజీ చదవకుండా సీఎం రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని హరీశ్‌రావు విమర్శించారు.
డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు: మంత్రి ఉత్తమ్
డ్యామ్‌కు, బ్యారేజీకు తేడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేశారని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో ఉందని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.మేడిగడ్డలో పూర్తి నీరు నిల్వ చేసి కూలిపోయేందుకు కారణమయ్యారని పేర్కొన్నారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై ఉత్తమ్ కుమర్‌రెడ్డి సభలో చర్చను ప్రారంభించారు.‘’తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.87,449 కోట్లతో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. కానీ, మేడిగడ్డ.. సుందిళ్ల, అన్నారం నిరుపయోగంగా మారాయి. ప్రాణహిత-చేవెళ్లకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ దెబ్బతింది. 3 బ్యారేజీలు 20 నెలలుగా నిరుపయోగంగా మారాయి. ప్రాణహిత -చేవెళ్ల డిజైన్లను అప్పటి సీఎం మార్చారని కమిటీ చెప్పింది. మేడిగడ్డలో బ్యారేజీ నిర్మించవద్దని వ్యాప్కోస్ నిపుణులు కూడా చెప్పారు. రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి.. రూ.1.47లక్షల కోట్లతో కాళేశ్వరం మొదలుపెట్టి..రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టారు. 2019 నుంచి 2023 వరకు లిఫ్ట్ చేసినవి 162 టీఎంసీలు మాత్రమే.కాళేశ్వరం నుంచి ఏడాదికి 20.2 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. బ్యారేజీలకు జరిగిన నష్టం రాష్ట్రానికి పెనుభారంగా మారింది. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. స్వాతంత్య్రం వచ్చాక ఇలాంటి విపత్తు ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పుడు భారత రాష్ట్రసమితి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఎన్‌డీఎస్‌ఏపై భారత రాష్ట్రసమితి నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బిల్లు తెచ్చినప్పుడు భారత రాష్ట్ర సమితి మద్దతిచ్చింది’’ అని ఉత్తమ్ కుమార్‌రెడ్డి వివరించారు.
రూ.లక్ష కోట్ల ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయింది: భట్టి
హైదరాబాద్: రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. కమీషన్లు దండుకునేందుకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుకుంటూ పోయారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 50, 60 ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా అలాగే ఉన్నాయన్నారు. ‘‘నిజాం కట్టిన పోచారం ప్రాజెక్టు వరదను తట్టుకొని కూడా నిలబడిరది. టెక్నాలజీ కాలంలో భారత రాష్ట్ర సమితి కట్టిన ప్రాజెక్టు మాత్రం మూడేళ్లకే కూలింది. జస్టిస్ పీసీ ఘోష్‌కు ప్రముఖ న్యాయకోవిదుడిగా పేరుంది. ఆయనకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు. ఎన్‌డీఎస్‌ఏ అధికారుల మీద కూడా అపనిందలు వేస్తున్నారు.కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలంతా చూశారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది. మీ వాదనలు విన్న తర్వాతే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. కక్షసాధింపు ధోరణి ఉంటే ప్రాజెక్టు కూలినప్పుడే చర్యలు తీసుకునేవాళ్లం. తప్పులు ఉన్నాయి కాబట్టే కోర్టుకు వెళ్లి నివేదికను అడ్డుకోవాలని చూశారు. ఏ ప్రాజెక్టు అయినా.. ఇంజినీర్లు, సబ్జెక్టు నిపుణులు డిజైన్ చేస్తారు. కాళేశ్వరానికి మాత్రం కేసీఆర్, హరీశ్‌రావు కలిసి డిజైన్లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వాడుకున్న నీళ్లకంటే ఎత్తిపోసి.. వదిలేసినవే ఎక్కువ. దగ్గరుండి కట్టించినందుకు హరీశ్‌రావు.. కాళేశ్వరరావుగా పిలిపించుకున్నారు. నిజాలు చెప్పలేక మేడిగడ్డ ప్రాజెక్టులాగే హరీశ్‌రావు కూడా కుంగిపోతున్నారు. నేను మాట్లాడే ప్రతి అంశం జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలోని అంశాలే. కాళేశ్వరం నుంచి నీళ్లు పోయాయి. డబ్బులు పోయాయి. ఇప్పుడు బనకచర్ల నుంచి నీళ్లు వాడుకుంటామని ఆంధ్రప్రదేశ్ అంటోంది. వృథాగా సముద్రంలోకి పోయే నీటిని తీసుకుంటామని అంటున్నారు. దిగువ రాష్ట్రం బనకచర్ల కట్టుకుంటామని అంటోందంటే దానికి మీరే కారణం. కమిషన్‌పై ఇవాళ నిర్దిష్టమైన నిర్ణయం జరగాలని కోరుకుంటున్నా. కమిషన్ నివేదికను, ప్రజలను పక్కదారి పట్టించేందుకు భారత రాష్ట్ర సమితి ప్రయత్నిస్తోంది. మిమ్మల్ని వదిలేసి మా ప్రభుత్వం తప్పు చేస్తుందా అనే భావన కలుగుతోంది. కాగితాలు చింపి విసరడం సభా సంప్రదాయాలకు విరుద్ధం. సభ నియమాలు, నిబంధనలను నేతలు పాటించాలి. ఈ నివేదిక ప్రజల్లోకి వెళ్లకుండా ప్రతిపక్ష పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు. అంతిమంగా ప్రజలు, సభ ఏం కోరుకుంటున్నాయో ఆ తీర్పు అలాగే ఉంటుంది.’’ అని భట్టి విక్రమార్క అన్నారు.
కాళేశ్వరం రిపోర్టు వేస్ట్..
` బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్
` జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ప్రతులు చించివేత
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ప్రతులను భారత రాష్ట్రసమితి ఎమ్మెల్యేలు చించివేశారు. లాబీల్లో భారీగా మార్షల్స్ మోహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో సమావేశం అనంతరం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలంతా సభ నుంచి బయటకు వచ్చి.. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మైక్ కోసం గంటన్నర సేపు ఎదురు చూసినా స్పీకర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కాగితాలు చించి విసరడం సభాసప్రందాయాలకు విరుద్ధమని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సభ నియమాలు, నిబంధనలను భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు పాటించాలని సూచించారు. ఈ నివేదిక ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
660 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడమంటే ఎలా?
` హరీశ్‌రావు
హైదరాబాద్(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసి, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా?అని ప్రశ్నించారు. 660 పేజీల నివేదికపై అరగంటలోనే అన్నీ మాట్లాడాలంటే ఎలా? ఇది సాధ్యమయ్యే పనేనా?అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై చర్చ సందర్భంగా హరీశ్‌రావు అసెంబ్లీలో మాట్లాడారు. కమిషన్ నివేదికపై రేపు, ఎల్లుండి కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.‘’నాకు రెండుగంటల సమయం ఇవ్వాలి. మధ్యలో జోక్యం చేసుకోవద్దు. ఆదివారం రోజు సభలో నివేదిక పెట్టారంటేనే వారి ఉద్దేశం అర్థమవుతోంది. కోర్టుకు వెళ్లడం మాకు రజ్యాంగం ఇచ్చిన హక్కు. గతంలో ఇలాంటి విషయాలపై ఇందిరాగాంధీ, అడ్వాణీ కూడా కోర్టుకు వెళ్లారు. ఆదరాబాదరాగా ఆదివారం సభలో పెట్టారంటేనే మీ కుట్రలు అర్థమవుతున్నాయి. మీరు చేసిందంతా పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగిందా? లేదా? తేలాలి. నిష్పాక్షికంగా జరగకపోతే ఆ కమిషన్ నివేదిక చిత్తుకాగితమని సుప్రీం కోర్టు చెప్పింది. అరోపణలపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్‌లో స్పష్టంగా చెప్పారు. సభ్యులకు 8బి, 8సి కింద నోటీసులు ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉంది. 8బి కింద నోటీసులు ఇవ్వకపోతే ఆ కమిషన్ నివేదికలు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పింది.ఎమర్జెన్సీపై విచారణ జరపాలని షా కమిషన్ వేశారు. దానిపై దేశమంతా కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టారు. షా కమిషన్‌ను ఆనాడు నోటికి వచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తిట్టారు. చట్టాలను తుంగలో తొక్కుతూ ఏకపక్షంగా ఈ కమిషన్ ఇచ్చారు. 8బీ నోటీసులు ఇవ్వకుండా నివేదిక ఇచ్చారని ఆ రోజు సుప్రీం కోర్టు కొట్టేసింది. మాపై వేసిన ఈ కమిషన్ కూడా రాజకీయ ప్రేరేపితం, కుట్రే. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా కోర్టులో నిలబడదు. ఇది డొల్ల రిపోర్టు. హక్కులకు భంగం కలిగినప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్తారు. నివేదికను రద్దు చేయాలనే కోర్టుకు వెళ్లాం. అసెంబ్లీలో చర్చించవద్దని కోరలేదు’’ అని హరీశ్‌రావు అన్నారు.
మ్యాచ్ ఫిక్సింగ్‌లా అనిపిస్తోంది
` కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించిన తీరు చూస్తే అదే అనుమానం కలుగుతోంది
` జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది
` భాజపా శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా భాజపా శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితిలపై విమర్శలు గుప్పించారు. ‘‘ఇది కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు.. కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి కలిసి ఇచ్చినట్లు ఉంది. నివేదికలో కేసీఆర్ అవినీతిపై ప్రస్తావన లేకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి. విచారణకు ఆదేశించిన తీరు చూస్తే మ్యాచ్ ఫిక్సింగ్‌లా అనిపిస్తోంది. అవినీతి చేసినవారు ఎవరో తేలేవరకు ప్రజలు ఊరుకోరు. ప్రజలు కోరుకునే విధంగా విచారణ చేయించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. అవినీతి చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీరే చెప్పారు.. మరి చర్యలేవి? జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది. భారత రాష్ట్ర సమితిపై కాంగ్రెస్‌కు ప్రేమ పెరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్, ఓఆర్‌ఆర్, కాళేశ్వరం, మిషన్ కాకతీయపై తీసుకున్న చర్యలేంటి? కాళేశ్వరంపై సీబీఐ విచారణ వేస్తారా.. సిట్ విచారణ వేస్తారా? కాళేశ్వరంపై చేసిన జ్యుడీషియల్ విచారణ క్వాష్ అయ్యే పరిస్థితి ఉంది. అవినీతి చేసిన డబ్బును ఎలా తీసుకువస్తారో ప్రభుత్వం చెప్పాలి. భారత రాష్ట్ర సమితితో కాంగ్రెస్‌కు లోపాయికారి ఒప్పందం ఉందని తెలుస్తోంది’’ అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సభలో విరుచుకుపడ్డారు. అనంతరం భాజపా సభ్యులు తమకు కాళేశ్వరం నివేదికపై మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వలేదని వాకౌట్ చేశారు.