నేడు సడక్‌ బంద్‌

జనంసాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు కర్నూలు రహదారిపై గురువారం ‘సడక్‌ బంద్‌’ జరగనుంది. అలంపూర్‌. చౌరస్తా నుంచి కొత్తూరు వరకు జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ భాగస్వామ్యపక్షాలైన టీఆర్‌ఎస్‌, బీజేపీ, న్యూ డెమోక్రసీలతోపాటు వివిధ ప్రజాసంఘాలు పాల్గొంటున్నాయి. ప్రభుత్వం సడక్‌ బంద్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో ఎలాగైనా దీన్ని విజయవంతం తీరతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రహదారిపై కొన్ని కేంద్రాలను గుర్తించి పార్టీలు, వివిధ సంఘాల నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అలంపూర్‌ చౌరస్తా వద్ద జరిగే సడక్‌ బంద్‌లో తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం పాల్గొననున్నారు.
చట్టం తన పని తాను చేస్తుంది : సీఎం కిరణ్‌
తెలంగాణ జేఏసీ గురువారం తలపెట్టిన సడక్‌ బంద్‌కు అనుమతి లేదన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రోడ్లను స్తంభింపచేస్తామంటే ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అది చట్టవిరుద్ధమని చెప్పారు. ఇలాంటి ఆందోళనలపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులిచ్చిందని, అందుకు భిన్నంగా తాము అనుమతులు ఇవ్వలేమన్నారు. ఎక్కడైనా గ్రౌండ్‌లో సభలు, సమావేశాలు పెడితే అనుమతించేదుకు ఇబ్బంది లేదు.. కానీ ప్రజలు వినియోగించే రోడ్లను స్తంభింపచేయడానికి అనుమతివ్వడం ఎలా సాధ్యమన్నారు. సడక్‌బంద్‌పై చట్టం, పోలీసుశాఖ తమ పని తాము చేస్తాయని ఆయన స్పష్టంచ చేశారు.