పగ్గాలు చేపట్టడంపై రాహులే నిర్ణయించుకోవాలి : సోనియా

న్యూఢిల్లీ:పార్టీలో కీలక పాత్ర పోషించడం, పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో తుది నిర్ణయం రాహుల్‌ దేనని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. యూపీఏ ఉప రాష్ట్రపతిగా అభ్యర్దిగా హమీద్‌ అన్సారీ నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో సోనియా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2014 ఎన్నికల ముందు రాహుల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గానీ, ఉపాధ్యక్షుడిగా కానీ పనిచేసే అవకాశముందా అని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సోనియా ఆ నిర్ణయం రాహుల్‌ ఒక్కడే తీసుకోగలడని జవాబిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్దిగా రాహుల్‌ ముందుకొస్తారా లేదా అని పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్న ఈ సమయంలో సోనియా వ్యాఖ్యలు చిన్నపాటిి సంచలనాన్నే సృష్టించాయి. పార్టీ సీనియర్‌ నేతలు ఇటీవల తరచూ తమ వ్యాఖ్యల్లో రాహుల్‌ ప్రస్తావన తెస్తుండడంతో ఈ విషయం చర్చనీయాంశం అయింది. రాహుల్‌ కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రులు దిగ్విజయ్‌ సింగ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌లు ఈ సందర్భంగా సోనియాతో అన్నారు. అయితే ఈ విషయంలో రాహుల్‌ తప్ప ఇంకెవరూ నిర్ణయం తీసుకోలేరని అన్న సోనియా పార్టీలో కీలక పాత్ర పోషించే విషయంపై రాహుల్‌గాంధీ స్వయంగా నిర్ణయించకుంటారని తెలిపారు.