పాకిస్థాన్‌ తరపున గూడఛర్యం చేస్తున్నారనే ఆరోపణలపై భార్య, భర్తల అరెస్టు

అమృత్‌సర్‌: పాకిస్థాన్‌ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఓ ప్రభుత్వ అధికారిణి, ఆమె భర్తను పంజాబ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పాక్‌ ఉగ్రవాద సంస్థలతో వీరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం పంజాబ్‌లోని తార్న్‌తరణ్‌ జిల్లాకు చెందిన సుఖ్‌ప్రీత్‌కౌర్‌ అమృత్‌సర్‌లో విక్రయ పన్ను అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త సూరజ్‌పాల్‌సింగ్‌. వీరికి పంజాబ్‌లో భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు పక్కన సొంత భూమి ఉంది. దంపతులిద్దరూ భారత్‌ రక్షణ దళాల రహస్య సమాచారాన్ని సేకరించి, పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారు. ఇందుకు సులభమైన మార్గాన్ని ఎంచుకున్నారు. రహస్య పత్రాలు, మ్యాపులను భారత్‌-పాక్‌ సరిహద్దులోని తమ భూమిలో నిర్దేశిత ప్రాంతంలో పాతిపెట్టేవారు. పాక్‌ ఉగ్రవాదులు వాటిని అక్కడినుంచి తీసుకునేవారు. వీరి కదలికలపై సమాచారం అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసారు.