పాటను బంధించినా స్పందించరా?

తెలంగాణ ఉద్యమంలో ప్రజాఫ్రంట్‌ నాయకురాలు, ప్రజా గాయకురాలు విమలక్క ప్రభావం ఇంత అని చెప్పలేం. ఆమె పాటకు యువత నరనరాల్లో ఉద్యమ భావం ఉప్పొంగుతుంది. ఆమె కాలి గజ్జెల చప్పుడుకు ప్రతి హృదయం స్పందిస్తుంది. మా భూమి, మా గడ్డ, మా ఊరు పరాయి పాలన నుంచి విముక్తి పొందాలని ప్రతి ఒక్కరు ముందడుగు వేస్తారు. పాట..మాట.. నృత్యం… ఆమెకు మాత్రమే జన్మతా వచ్చిన సుగు ణాలు. ఉద్యమ నేపథ్యం గల కుటుంబంలో పుట్టిన ఆమె జీవితమంతా ఉద్యమమే అయి సాగింది. ఎక్కడ అన్యాయం జరిగినా.. ఎవరిని అణచివేసినా.. హక్కు లకు భంగం వాటిల్లినా ఆమె అక్కడికి చేరుకుంటారు. పీడితుల పక్షాన గజ్జకట్టి గళమెత్తుతారు. దోపిడీదారుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తేలా వేదికపై ఎగిరి గంతేస్తారు. ఆమె బండబారిన గుండెల్లోనూ విప్లవాగ్ని రగిలిస్తార నడంలో ఎలాంటి అనుమానాలు లేవు. తెగువ, తెగింపు పీడిత ప్రజల పక్షాన నిలబడాలనే తలంపు ఆమెను ఎన్నోసార్లు ఇబ్బందుల పాలు  చేసినా ఎంతమాత్రం వెరువలేదు. పాలకులు ఎన్ని నిర్బంధాలు విధించినా ఇసుమంతైనా భయాందోళన చెందలేదు. నిర్బంధం పెరుగుతుంటే ఆమె ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడారు. గళం విప్పి పాటపడారు. గజ్జెల సవ్వడితో నేనున్నాననే భరోసా కల్పించారు. అలాంటి విమలక్క ప్రజాజీవితంలో ఉంటే ఎంతో మంది తెలంగాణ యువకులను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు ఆకర్షిస్తారేమోనని రాష్ట్ర సర్కారు భయపడింది. అతివాద భావజాలం కలిగిన విమలక్కపై ఏకంగా 29 కేసులు బణాయించింది. నిజామాబాద్‌లో ఎప్పుడు జరిగిన సంఘటనపై కుట్రకేసు నమోదు చేసింది. దాని చుట్టూ చిలువలు పలువలుగా అనేక కేసులు అల్లుకుంటూ పోయింది. తెలంగాణ మార్చ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహ ధ్వంసం, సీమాంధ్ర నేతల ఆస్తులపై దాడులకు పురిగొల్పారని, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని, రాజద్రోహం చేశారని ఇలా అనేక కేసులు పెట్టి ఉద్యమ గొంతుకను బందీఖానాకు తరలించారు. అప్పుడే ఆమెను అరెస్టు చేసి 55 రోజులు గడిచిపోయాయి. విమలక్క స్వార్థం కోసం ఏదో నేరం చేసి జైలుకు వెళ్లలేదు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష, ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమె పది జిల్లాల్లోని మూల మూలకు వెళ్లి ప్రచారం చేశారు. తెలంగాణ ప్రజాఫ్రంట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆమె సొంత మార్గాన్ని ఎంచుకోవచ్చుగాని లక్ష్యం ఒకటే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప వేరే ప్రత్యామ్నాయమే లేదని ఆమె ఎన్నో వేదికలపై ఎలుగెత్తి చాటారు. రాజకీయ ఉద్యమం చేస్తున్న వారితో పలు సందర్భాల్లో విభేదించి ఉండవచ్చుగాని లక్ష్యం నుంచి దూరంగా జరగలేదు. తెలంగాణ సాధన కోసం మిగతా ఉద్యమ సంఘాలు ఎన్ని పోరాటాలు సాగిస్తున్నారో విమలక్క కూడా అదే స్థాయిలో ఉద్యమాలు సాగించారు. అదే క్రమంలో ప్రభుత్వ కుట్రతో జైలుకు వెళ్లారు. ఆమె జైలుకు వెళ్లి ఇన్ని రోజులవుతున్నా తెలంగాణ సాధన కోసం ఉద్యమిస్తున్న ఒక్క రాజకీయ పక్షమూ ప్రభుత్వ చర్యను తప్పుబట్టలేదు. ఒక్కరు కూడా ఆమెను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేయలేదు. టీ జేఏసీ పక్షాన, ఎమ్మార్పీఎస్‌ పక్షాన ఉద్యమ బాట పట్టేంతవరకు ఎవరూ స్పందించలేదు. విద్యాసంస్థల బంద్‌ నిర్వహించి విద్యార్థిలోకం ఆమెను విడుదల చేయాలని కోరినా రాజకీయ పక్షాల్లో కదలిక రాలేదు. సొంత ఉద్యమ పంథా అవలంబించే వారంతా శత్రువులైపోతారా? అలా అందరినీ శత్రువులుగా తలిస్తే సీమాంధ్ర పెట్టుబడీదారి ప్రభుత్వానికి అది వరంలా మారుతుంది. బ్రిటిష్‌ పాలనలో మగ్గిన సీమాంధ్ర నేతలకు వారు దేశంలో విడిచిపెట్టి వెళ్లిన విభజించి పాలించు విధానం అనువణువునా ఒంటబట్టించుకున్నారు. దానిని తూచా తప్పకుండా అమలు చేస్తూనే ఇంతకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వారు పరిపాలన సాగించారు. హక్కుల కోసం ఉద్యమించిన ఎన్నో గొంతులకలను అవలీలగా తెగనరికారు. తుపాకి గుండ్ల వర్షం కురిపించి ఎందరో రేపటి భారత పౌరులను బలితీసుకున్నారు. నక్సలైట్ల పేరు చెప్పి పౌరహక్కుల నేతలనూ, జర్నలిస్టులను మట్టుబెట్టారు. 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమించిన వందలాది మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్నారు. అలాంటి సీమాంధ్ర పాలకులకు లోకువయ్యేలా ఎవరు వ్యవహరించినా ఎంతమాత్రం క్షమార్హం కాదు. అన్యాయ్యాన్ని అన్యాయం అనకపోతే అన్యాయం చేస్తున్న వారికి వత్తాసు వత్తాసు పలికినట్లే. అలా ఎవరు వ్యవహరించినా ఆమోదయోగ్యం కాదు. తాత్కాలిక ఆవేశాన్ని, అసూయను చాటుకునేందుకు శత్రువులకు మంచిచేసేలా వ్యవహరించవద్దు. ఈరోజు విమలక్క ఎదురైన పరిస్థితే రేపు మరో నేతకు ఎదురుకావొచ్చు. అకారణంగా, అన్యాయంగా జైలు పాలు కావొచ్చు. అలాంటి పరిస్థితి ఇదివరకు ఎదుర్కొన్న వారూ ఉన్నారు. అయినా గుణపాఠాలు నేర్చుకోకుంటే అంతకుమించిన తప్పిదం మరొకటి కాదు.