పార్టీ వ్యవహారాల్లో..  కొప్పుల రాజు జోక్యం లేదు 

– బహిరంగ విమర్శలు చేస్తే చర్యలు తీసుకుంటాం
– టీకాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యులు కుంతియా
హైదరాబాద్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల్లో ఏఐసీసీ నేత కొప్పుల రాజు జోక్యం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు.  సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించి అన్ని వ్యవహారాలను తనతోపాటు ఇంఛార్జి ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షుడు, స్థానిక నాయకులు అంతా కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్టీకి సంబంధించి ఏఐసీసీ ఇంఛార్జి ప్రధాన కార్యదర్శిగా తనకు గానీ, పీసీసీ అధ్యక్షుడికి గానీ, స్థానిక నాయకులకు గానీ ఫిర్యాదు చేసినట్లయితే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆలా కాకుండా కొందరు నేరుగా బహిరంగంగా విమర్శలు చేయడం క్రమశిక్షణా రాహిత్యం అవుతుందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కొప్పుల రాజు జోక్యం ఎక్కువైందని, ఆయన్ను కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటూ రేణుకా చౌదరి సహా పలువురు నేతలు
విమర్శలు చేశారు. కొప్పుల తీరు సరిగా లేదని, ఆయన కేవలం కొందరికే ప్రాధాన్యతనిస్తూ మిగిలిన కాంగ్రెస్‌ నేతలను వెనక్కు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కొప్పుల రాజు తీరుతో గ్రామస్థాయిలోని పార్టీకి చెందిన బలమైన కార్యకర్తలు పార్టీని వీడుతున్నారని అన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆలోచనా విధానాలతో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పటికైన ఆయన్ను పక్కకు తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఓ లేఖను రేణుకచౌదరి వర్గీయులు, ఇతర నేతలు అధిష్టానానికి అందజేశారు. ఈ నేపథ్యంలో కుంతియా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.