పుట్టింది మొదలు.. సర్వం ఉత్తరాంధ్రతోనే మమేకం..

శ్రీకాకుళం,హైదరాబాద్‌,నవంబర్‌ 2: కింజరపు ఎర్రంన్నాయుడు..జీవన ప్రయాణం యావత్తు.. అంటే పుట్టింది మొదలు.. నిష్క్రమణ వరకు ఉత్తరాంధ్ర జిల్లాలోనే కొనసాగిందంటూ నిమ్మాడలోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. పుట్టింది నిమ్మాడలో.. విద్యాభ్యాసం.. గార, టెక్కలి, విశాఖపట్నంలలో.. శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం అంచలంచెలుగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. శ్రీకాకుళం ఎంపీగా నాలుగుసార్లు కొనసాగి.. కేంద్రమంత్రిగా పనిచేశారు.టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగుతూ.. శుక్రవారం తెల్లవారుజామున శ్రీకాకుళంలోని కిమ్స్‌లో తుదిశ్వాస వీడడంపై.. గుండెలు బాదుకుంటున్నారు.
ఆయన ప్రజల మనిషి.. ప్రజలంటే అమిత ఇష్టం.. ఎవరు..ఎప్పుడు.. ఎక్కడికి పిలిచినా … ఏ కార్యక్రమానికి ఆహ్వానం పంపినా క్షణాల్లో అక్కడకు చేరుకుని నేనున్నానంటూ.. భరోసా ఇచ్చే ఎర్రన్న.. చేదోడు వాదోడుగా నిలిచే కింజరపు ఎర్రంన్నాయుడు ఇకలేరు.. అన్న వార్తతో ఉత్తరాంధ్ర ప్రజానీకం ఉలిక్కిపడింది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తమతో గడిపిన వ్యక్తి ఇక లేరంటే తట్టుకోలేకపోతున్నామని మందస, కవిటి ప్రాంతాల ప్రజలు రోదిస్తున్నారు. శీర నాగేశ్వరరావు అంత్యక్రియల కార్యక్రమంలోనే గాక పలు అభివృద్ధి కార్యక్రమాల్లోను పాలుపంచుకున్న ఆయన శుక్రవారం తెల్లవారగానే ఇకలేరంటే నమ్మబుద్ది కావడం లేదని వాపోతున్నారు.
ఎర్రంనాయుడి జీవిత ప్రధాన ఘట్టాలు..
–1983లో టీడీపీలో చేరిక.. హరిశ్చంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
–1983 నుంచి 1996 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు.
–1996, 98, 99, 2004లలో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు.
–1995-96లో చీఫ్‌విప్‌గా పనిచేశారు.
–బిజెపి ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యపక్ష ప్రతినిధిగా కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు.
–1999-2000 మధ్య రైల్వే కమిటీ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించారు.