పులిచింతల జాప్యం వల్లే డెల్టాకు నీటి సమస్య

గుంటూరు, జూలై 20 : పులిచింతల నిర్మాణం పూర్తయి ఉంటే డెల్టాకు సాగునీటికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదని ఎమ్మెల్యే రాయపాటి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం దుగ్గిరాల మార్కెట్‌ యార్డును సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు నీరు వచ్చేవరకు డెల్టాకు నీరు రావడం లేదనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పులిచింతకు శంకుస్థాపన చేసిన తదుపరి వచ్చిన చంద్రబాబు పులిచింత పనులపై దృష్టి పెట్టలేదన్నారు. నాగార్జున సాగర్‌ నుంచి సాగునీరు తీసుకునే హక్కు మొదటగా డెల్టాకే ఉందన్నారు. పసుపు, మిర్చి వంటి పంటలకు కనీస మద్ధతు కల్పించే విషయాన్ని పెద్దల సభలో ప్రస్తావిస్తానన్నారు. గోడౌన్‌్‌లో పసుపు నిల్వల పరిరక్షణ కోసం అవసరమైన సిబ్బంది ఏర్పాటుకు మార్కెటింగ్‌ శాఖామంత్రులతో మాట్లాడి ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రైతుబంధు పథకం ద్వారా మరిన్ని రుణాలిచ్చేందుకు అవసరమైన పరిస్థితులు కల్పించేలా సంబంధిత ఉన్నతాధికారులతో చర్చిస్తానన్నారు. అనంతరం యార్డులో రైతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో యార్డు చైర్మన్‌ కొండపనేని చటర్జీ, మాజీ వైస్‌ చైర్మన్‌ కె. రవిచంద్‌, డైరెక్టర్లు వెంకట్రావు, సాంబశివరావు, శివారెడ్డి, ఆలపాటి వెంకట్రావు, రవి, రంగన సుబ్బారావు తదితరులు పాల్గోన్నారు.