పుష్కరాల్లో అదనపు ఛార్జీల బాంబు పేల్చనున్న ఆర్టీసీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే పుష్కరాలకు వెళ్తున్నారా? పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలకు సన్నాహాలు చేసుకుంటున్నారా? ఎందుకంటారా తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల బాంబు పేల్చనుంది. ప్రజల నెత్తిపై ఛార్జీల పిడుగు పడనుంది. ప్రత్యేక బస్సుల పేర 50 శాతం అదనపు ఛార్జీలు వడ్డించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గోదావరి పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులపై భారం మోపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చుక్కలు చూపించేందుకు ఆర్టీసీ రెడీ అయింది. సాధారణ ఛార్జీల కన్నా 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక బస్సులు, అదనపు సౌకర్యాల పేరుతో ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమైంది.
గోదావరి తీరం వెంట ఉన్న పుణ్య క్షేత్రాలు, పవిత్ర స్థలాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తోంది. భక్తులను స్నాన ఘట్టాల వరకు బస్సుల్లో తీసుకెళ్తామని తెలంగాణ ఆర్టీసీ జెఎండీ రమణారావు చెబుతున్నారు. పుష్కరాలు నిర్వహిస్తున్న 5 జిల్లాల్లో అంతర్గత సర్వీసులతో పాటు బాసర, ధర్మపురి, భద్రాచలం, కాళేశ్వరం క్షేత్రాలకు హైదరాబాద్ నుంచి బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. పుష్కరాల కోసం మొత్తం 2270 బస్సులు వినియోగిస్తున్నట్లు చెప్పారు.
ఆదిలాబాద్ జిల్లాకు 310 బస్సులు, నిజామాబాద్ జిల్లాకు 300, కరీంనగర్ జిల్లాకు 415, వరంగల్ జిల్లాకు 355, ఖమ్మం జిల్లాకు 360 బస్సు సర్వీసులు నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. ఇక ప్రయాణికులకు ఎప్పటికప్పుడు వివరాలు తెలిపేందుకు.. పుష్కర ఘాట్ల వద్ద కంట్రోల్ రూములు ఏర్పాటు చేస్తోంది. భక్తుల రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతామని అధికారులు అంటున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.