పెట్రోల్‌ పోసుకొని..

వివాహిత ఆత్మహత్యాయత్నం
– బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఘటన
– మంటలను ఆర్పి.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
– పోకిరి వేదింపులే కారణం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట విషాధ ఘటన చోటు చేసుకుంది. సబిత అనే ఓవివాహిత పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. స్టేషన్‌కు వచ్చిన సబిత ఒక్కసారిగా పెట్రోల్‌ పోసుకుని ఒంటికి నిప్పంటించుకోవటంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను రక్షించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. దినేష్‌, సబితకు గత నాలుగేళ్లుగా వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలుఉన్నారు. అయితే దినేష్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పేద కుటుంబంకు చెందిన వారు కావటంతో బోయిన్‌పల్లి స్టేషన్‌ పరిధిలో ఓ పెంట్‌హౌస్‌లో నివాసముంటున్నారు. సబిత స్నానం చేస్తున్న సమయంలో బాత్‌రూంకు పైకప్పు లేకపోవటంతో పక్కనే ఉండే వెంకటేష్‌ అనే వ్యక్తి ఫోటోలు తీశాడు. ఈ ఫొటోలు చూపుతు గత కొద్ది రోజులుగా సబితను వెంకటేశ్‌ అనే పోకిరీ వేధిస్తున్నాడు. దొంగచాటుగా పోటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. దీంతో పోలీసులకు సబిత పిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు సరిగా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన సబిత మంగళవారం మధ్యాహ్నం సమయంలో పీఎస్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.