పేకాట కేంద్రంగా హైదరాబాద్: టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు!

మంగళవారం, 10 ఫిబ్రవరి (జ‌నంసాక్షి)

playing cards clubs

 

పేకాట కేంద్రంగా హైదరాబాద్ మారిపోయింది. హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అర్థరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 52 మందిని ఈ దాడుల్లో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 12 లక్షల నగదు, 60 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 
రీక్రియేషన్ ముసుగులో నడుస్తున్న పేకాట క్లబ్బులను ప్రభుత్వం గత కొద్ది నెలలు కింద మూసివేసింది. దీంతో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే కొంత కాలం నుంచి గుట్టుగా పేకాట నిర్వహిస్తున్నారు. 
ఈ విషయంపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని 707, 708 ఫ్లాట్‌లలో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. 
పేకాట రాయుళ్ల కోసం ఇక్కడ ప్రత్యేక భోజన ఏర్పాట్లు, ఆడేందుకు ప్రత్యేక కుర్చీలు సైతం ఏర్పాటు చేసి ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఫర్నీచర్‌ను సైతం సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడ ప్రాంతాలకు చెందిన ఆయా పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.