పేద‌ల‌కు కూర “గాయా”లు

4ic690wxవర్షాకాలంలో కారుచౌకగా లభించాల్సిన కూర”గాయ”లు పగలే చుక్కలను చూపిస్తున్నాయి. వంద పెట్టినా కేజీ కంద రావడం లేదు. పేదలకు ఎల్లవేళలా అండగా ఉండే బెండ కూడా కొండ ఎక్కి కూర్చొంది. ఇవి కేజీ రూ.50 నుండి రూ.70 వరకు అమ్ముతున్నాయి. ములగ అలిగి మూలన కూర్చుంటే, అరటి అటకెక్కింది. నోరూరించే వంగ బెంగతో మంచం పట్టింది. ఇక బీన్స్‌ అయితే ఛాన్సే లేదు. రెండంకెల రేటు దాటిపోయింది. సొర, బీరకాయల ధరల ముందు బీరు కాయలు దిగదుడుపులా వున్నాయి. క్యారెట్‌ కంటే కోడి మాంసమే తక్కువగా వుంది. పచ్చి మిర్చిని కళ్ళతో చూస్తేనే మంట పుట్టిస్తోంది. టమాటా తన వాటా తక్కువేం కాదంటోంది. ఇలా మొత్తానికి ఏ కూరగాయ ధరలు చూసినా కొని, తినలేని పరిస్థితుల్లో నింగినంటాయి. మున్నెన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో పెరిగిన ఈధరలతో పేద, మధ్యతరగతివర్గాలు బెంబేలెత్తుతున్నారు. చివరకు ఆకు కూరలు సైతం కట్ట రూ.20లు అమ్ముతోంది. బయట మార్కెట్లో కంటే రైతు బజార్లలో రూ.10 నుండి రూ.20 తక్కువగా లభ్యమవుతున్నప్పటికీ, ఇంత భారీస్థాయిలో రేట్లు పెరగడం ఇదే మొదటిసారని రైతులే అంగీకరిస్తున్నారు.అయితే రైతు బజార్లకు వచ్చిన కూరగాయల్లో మంచివి, నాణ్యమైన వాటన్నింటినీ బయట వ్యాపారస్తులకు ముందుగా విక్రయిస్తారు. మిగిలిన నాసిరకం వాటిని రైతు బజార్లలో అమ్ముతున్నారు. దీనివల్ల బయట మార్కెట్లో కంటే రూ.20 తక్కువగా లభించినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. రైతు బజార్లలో నాణ్యమైన కూరగాయలను ఏరుకునే అవకాశం వినియోగదారులకు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. గతంలో రైతు బజారుకి వెళ్ళి రూ.200ల కూరగాయలు కొంటే వారం సరిపోయేవి. అటువంటిది ఇప్పుడు రెండు రోజులు కూడా రావడం లేదని, ఇలా అయితే జీవనమెలా అంటూ పేదలు వాపోతున్నారు.

కూరగాయలకు ప్రత్యామ్నాయంగా పప్పు కూరలు తిందామంటే వాటి ధరలు మరింతమండిపోతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలో కేజీ రూ.50 నుండి రూ.70వరకు అదనంగా పెరిగాయంటే మార్కెట్‌ పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. నెల క్రితం వరకు కేజీ రూ.70లు అమ్మిన కంది పప్పు ప్రస్తుతం రూ.120 నుండి రూ.130 అమ్ముతోంది. పెసరపప్పు, మినపపప్పు రేట్లు కూడా ఇదే విధంగా రెట్టింపయ్యాయి. చింతపండు కేజీ రూ.120 అమ్ముతుండగా, ఎండు మిర్చి మరింత ఘాటెక్కింది. గతంలో కూరగాయల రేట్లు పెరిగినప్పుడు పేద, మధ్యతరగతివర్గాలు ఆకు కూరల పప్పుతో ఆ సమస్యను అధిగమించేవారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా చేజారింది. పప్పుతోపాటు, దానిలో వినియోగించే చింతపండు, ఎండుమిర్చి, నూనె,ఆకుకూరల ధరలన్నీ ఒకేసారి పెరగడంతో పేదలు పచ్చళ్ళతో, గంజి నీళ్ళతో జీవనం సాగిస్తూ అర్థాకలితో కాలం వెళ్లదీస్తున్నారు.

కూరగాయలు, పప్పులు, నూనెల ధరలు పెరగడంతో సహజంగానే కర్రీ పాయింట్లలోనూ ధరలు పెంచేశారు. గతంలో రూ.20లు అమ్మే చిన్నపాటి కర్రీ ప్యాకెట్లను ఇప్పుడు రూ.25కి పెంచారు. ఇక సాంబారు అయితే అది రసమో, సాంబారో అర్థంగాని పరిస్థితిలో పూర్తిగా పలుచబడిపోయింది. ఇక దాంట్లో భూతద్దం పెట్టి వెదికినా కూరగాయ ముక్కలు కానరావడం లేదు. క్వాలిటీ, క్వాంటిటీ రెండూ పడిపోయాయి. షాపులు మూయలేక, అలాగని నష్టాలను భరించలేక మొక్కుబడిగా అమ్మాల్సి వస్తుందని, ఇదేవిధంగా మరో నెలపాటు కూరగాయల ధరలు కొనసాగితే తమ చేతికి చిప్పేనని కర్రీ పాయింట్ల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఇక హోటల్స్‌లోనూ ఇవే పరిస్థితులు ప్రతిబింబిసు ్తన్నాయి. కొందరు భోజనం రేట్లు పెంచగా, మరికొందరు అకస్మాత్తుగా ధరలు పెంచలేక, అలాగని ప్రతిరోజూ నష్టాలు భరించలేక తక్కువ ధరకు లభించే కూరగాయలతో సరిపెడుతూ మమ అనిపిస్తున్నారు.

ఈ సంవత్సరం మార్చి నుండి దాదాపు మూడు నెలలపాటు ఎండలు తీవ్రస్థాయిలో ఉండటం, మరోపక్క రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసమీకరణను పురస్కరించుకొని జరీబు భూముల రైతులు కొందరు కూరగాయల తోటలు సాగు చేయకపోవడం ప్రస్తుతం కూరగాయ ధరలు పెరగడానికి కారణంగా పలువురు కూరగాయల వ్యాపారులు పేర్కొంటున్నారు. గుంటూరు జిల్లాలో కృష్ణానది తీరాన వేలాది ఎకరాల్లో కూరగాయ తోటలు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ భూములన్నింటినీ రాజధాని కోసం సేకరిస్తున్నారు. భూసమీకరణ ప్రక్రియకు జరీబు రైతులు ఎక్కువమంది సహకరించడం లేదు. అయితే భూసమీకరణకు అంగీకరించకుంటే భూసేకరణ తప్పదని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. అంతేగాక పంటలు వేయవద్దని ఆదేశించింది. ఈనేపధ్యంలో భూసమీకరణకు అంగీకరించని జరీబు రైతులు కూడా పరిస్థితి ఎప్పుడు ఎలా వుంటుందోనని భయపడి కొందరు పంటల సాగు నిలిపివేశారు. ఈ ప్రభావం కూరగాయ ధరల పెరుగుదలపై వుందని వారు పేర్కొంటున్నారు.

నెల రోజులుగా పప్పుల ధరలు మండిపోతున్నా, పక్షం రోజులుగా కూరగాయల ధరలు ఆకాశాన్నింటినా అధికార యంత్రాంగంలో చలనం లేదు. మార్కెట్లో పప్పు ధాన్యాల డిమాండ్‌ను ఆసరా చేసుకొని వ్యాపారులు సిండికేటై కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నా పాలకుల్లో స్పందన లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు, ధరల నియంత్రణకు సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఆహార సలహా సంఘాలు తీసుకుంటున్న చర్యలు శూన్యం. వ్యాపారుల అక్రమ నిల్వల వల్లే ఇంత పెద్దఎత్తున మార్కెట్లో కొరత ఏర్పడటానికి కారణమని ప్రభుత్వానికి తెల్సినా ఇప్పటివరకు ఎక్కడా దాడులు చేసిన దాఖలాల్లేకపోవడం గమనార్హం. మార్కెట్‌ ధరలను నియంత్రించడానికి రైతు బజార్లు ఏర్పాటు చేశామని చెపుతున్న పాలకులు ఇవి మరో కూరగాయల మార్కెట్‌లా రూపాంతరం చెంది వినియోగదారులను దోపిడీ చేస్తున్నా చర్యలు లేకపోవడం దారుణమని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పప్పులు, కూరగాయల ధరల అదుపుకు కృషి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.