పోటెత్తిన పెద్దగట్టు

 రెండో రోజు భక్తుల మొక్కులు, బోనాలు
 గట్టును దర్శించుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 9: నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతరకు సోమవారం రెండో రోజూ భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాలనుంచి భక్తులు ట్రాక్టర్లు, లారీలు, డీసీఎంలు, మినీ వ్యాన్‌లు, ఆటోల్లో తరలివచ్చారు. అర్ధరాత్రి అలంకరించిన గంపలు, కటారీ చేతబట్టి బేరీలు మోగిస్తూ నృత్యం చేస్తూ భక్తులు గుడిచుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి గుడి పరిసర ప్రాంతాలలో జంతు బలులు అర్పించారు. గుట్ట చుట్టూ పక్కన అరకిలో మీటర్‌ పొడవున వాహనాలు ఆపి గుడారాలు వేసుకొని రాత్రే వంటలు వండుకుని అక్కడే పడుకున్నారు. తెల్లవారుజామున జంతు బలులు ఇచ్చినవారంతా వాటిని వండుకొని తిరిగి నైవెద్యాలతో మొక్కులు చెల్లించుకునేందుకు తరలిరావడంతో ఆలయం జనంతో కిటకిటలాడింది. గుట్ట కింద, గుట్టపైన భక్త జనసందోహం నెలకొంది. సుమారు 3 లక్షలకు పైగా భక్తులు హాజరయ్యారని అంచనా. సో మవారం రెండోరోజు లింగమంతులస్వామి గుట్ట చుట్టూ దుకాణాలు వెలిశాయి. సర్కస్‌, ఎగ్జిబిషన్‌లతో పాటు పిల్లలను ఆకర్షించే అనేక రంగులరాట్నాలు వెలిశాయి. ఇదిలా ఉంటే, సోమవారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి సోమవారం ఉదయం లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.