పోరుగళం (తలారి రాజ్యం)

ప్రజల కోసం గొంతెత్తిన రాగానికిక్కడ ఉరి
ఆదివాసుల నాట్యానికిక్కడ చెర
కొండకోనలను ఏకం చేసే పాటకి సమాధి
స్వేచ్ఛా విహంగమైన గాత్రానికి చెరసాలలు ఉరికొయ్యలు
ప్రజాపథాన్ని పల్లవించడమే కళాకారుల నేరం !
జల్‌ జమీన్‌ జంగల్‌ మాదన్నందుకే పాటకు ఉరి !!
జార్ఖండ్‌ దిక్కులు పిక్కటిల్లేలా వాడు పాడి ఉండవచ్చు
ఆదివాసుల గుండె గాయాల్ని కెలికి ఉండవచ్చు
గాయం అబద్ధం కాదు.. గేయమూ అబద్దం కాదు
పచ్చనాకంత నిజం అడవి జీవితమంత స్వచ్ఛం
తరాలుగా తరగని మోసాన్ని ప్రశ్నించినందుకు రాజ్యం తలారయ్యింది.. తన కోసమే జీవిస్తే మరాండీకి మరణం చేరువయ్యేది కాదు.. తన జాతి కోసం జీవించడమే తల తీసేంత నేరమయ్యింది.. ఒక్క జీతన్‌ మరాండీ, అనిల్‌రాం, మనోజ్‌ రాజ్వర్‌, ఛత్రపతి మండల్‌కే ఉరి కాదు మరెందరికో.. ఐతే ఉరిశిక్షలు, కాకుంటే ఎన్‌కౌంటర్లు
అది అజాద్‌ అయినా, మల్లోజుల, పాండ్యన్‌ అయినా,
రైతు బిడ్డలు భూమయ్య, కిష్టాగౌడ్‌కైనా..
బిర్సాముండా అయినా, రాంజీ గోండ్‌ అయినా,
కళకీ మేధస్సుకీ కళాకారుడికీ, గాయకుడికీ
అదే ఉరి, కాకుంటే ఎన్‌కౌంటర్‌..
మరణాలన్నీ ఒక్కటే.. కారణాలన్నీ ధిక్కారమే..
జల్‌ జంగిల్‌ జమీన్‌ మాదన్నందుకే..
బతుకు విధ్వంసాన్ని నిలదీసినందుకే..
గాయాల గేయాలు పాడినందుకే..
వారి మెడలకు సామ్రాజ్యవాదుల ఉరితాళ్లు
కానీ.. రేపక్కడ అడవి అడవే పాడుతుంది
అప్పుడిక ఉరితాళ్లకు వేళ్లెక్కడ.. ?
లక్షల కోట్ల ఖనిజ సంపదకు కాళ్లెలా వచ్చాయి ?
అడవి బిడ్డల మల్లెతోటలు ఎరుపెక్కాయెందుకు ?
ఖనిజ సంపదను దోచినంత అవలీలగా
ఆదివాసుల అక్కాచెల్లెళ్ల మానమెవరు దోచారు?
చనుబాల కోసం అమ్మ స్తన్యానికి అతుక్కున్న
పసివాడి వేళ్లు నరికిన పైశాచికత్వానికి చావెప్పుడు ?
ఎన్ని తలలకు తలారులు కావాలిప్పుడు ?
నేలరాలిన నెత్తుటి చుక్కలను ప్రోది చేసుకుంటే అది నేరమా ? నెత్తురోడిన గాయాలకు గేయపు పూతలు పాపమా ? రక్త ప్రవాహాన్ని మోసుకొచ్చే చీకటి సూర్యోదయాలు కాదు నరమేథానికి తావే లేని రేపటి వేకువ కోసం వేచి చూద్దాం..
– అత్తలూరి అరుణ
(నేడు జీతన్‌ మరాండీ ఉరిశిక్ష వ్యతిరేక సభ సంధర్బంగా..)