పోలవరం డిజైన్‌ మార్చాల్సిందే: కవిత

హైదరాబాద్‌: పోలవరం డిజైన్‌ మార్చాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్‌ వ్యక్తం చేశారు. డిజైన్‌ మార్చకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును కట్టనివ్వమని హెచ్చరించారు. కేంద్రం గిరిజనుల పొట్టగొట్టి కాంగ్రెస్‌ సీమాంధ్ర ఎంపీలకు ప్రాజెక్టులను పంచిపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీపై అలిగిన నాయకులను ప్రాజెక్టులను అప్పగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సంబంధించిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి పోలవరం టెండర్‌ను అప్పగించారని తెలియజేశారు. రాయపాటి సమర్పించిన ఎన్నికల ఆఫిడవిట్‌లో తనకు ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఉందని చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. కానీ ఆ కంపెనీకి లైఫ్‌టైమ్‌ డైరెక్టర్‌గా రాయపాటి భార్య ఉన్నదని తెలియజేశారు. ఏ కంపెనీకి టెండర్‌ను అప్పగించినా డిజైన్‌ మార్చకుండా పోలవరాన్ని కట్టనివ్వమని తేల్చిచెప్పారు.