పోలీసులా? నేరస్తులా?

– కాల్‌లిస్ట్‌ వ్యవహారంలో కంగుతిన్న హోం శాఖ
– ఇలా ఇంకెంత మందిపై నిఘా పెట్టారో అన్న అనుమానం
– కీలక నంబర్ల సమాచారంపై ఆరా
హైదరాబాద్‌, జూన్‌ 27 : సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ వివి లక్ష్మీనారాయణ, ఆయన బాల్య స్నేహితురాలు వాసిరెడ్డి చంద్రబాట కాల్‌ డేటా రికార్డు (సిడిఆర్‌) లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు శాఖ పరువు, మర్యాదలను మంటగలిపి పనులకు పాల్పడుతున్న కొంతమంది అధికారులపై కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఇలాంటి తప్పులు పునరావృతం అవుతున్నాయన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. కేసుల దర్యాప్తులో భాగంగా టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి కాల్‌ డేటా రికార్డు పొందడం పెద్ద విషయమేమీ కాకపోయినా, తమ శాఖకే చెందిన ఉన్నతాధికారుల డేటా తీసుకున్న విషయంలో వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు దారితీస్తోంది. గతంలో కూడా ఇలాంటి సీడీఆర్‌ డేటా లీకేజీ కీలక నంబర్ల విషయంలో జరిగి ఉంటుందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అక్రమ మార్గంలో పొందిన లక్ష్మీనారాయణ, చంద్రబాల కాల్‌ డేటాను సాక్షి ఛానల్‌ ప్రసారం చేయటంతో వివాదం మొదలైంది. ఈ వ్యవహారం వెనక ఉన్న చీకటి కోణాలు నానాటికీ ఆవిష్కృతమవుతున్నాయి. సర్వీస్‌ ప్రొవైడర్‌ నుంచి సిడిఆర్‌ సంపాదించిన నాదారం ఇన్‌స్పెక్టర్‌ ఎం.శ్రీనివాసరావు తన డిసిపి పాస్‌వర్డ్‌ చౌర్యం చేసి డిసిపి ఇ-మెయిల్‌ ఐడి ద్వారా రిక్వెస్ట్‌ మెయిల్‌ పంపించినట్లు ప్రస్తుతం తెలిసింది. ఆసక్తికరంగా ఈ వ్యవహారం గురించి సదరు డిసిపికి ఏ మాత్రం తెలియకపోవడం ఆశ్చర్యకరం, ఇదిలా ఉండగా ఐబిఎం ఉద్యోగిణి చంద్రబాల ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీనివాసరావు, సాక్షి సీనియర్‌ రిపోర్టర్‌ యాదగిరిరెడ్డిపై మంగళవారం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో డిజిపి దినేష్‌రెడ్డికి పూర్తి నివేదికతో కూడిన వివరణను దర్యాప్తు అధికారులు బుధవారం అందజేశారు. ఈ నేపథ్యంలో సిఐ శ్రీనివాసరావుపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలకు ఉన్నతాధికారులు ఆదేశించారు. చంద్రబాల నంబర్‌ నుంచి తనకు తెలిసిన వ్యక్తికి బెదిరింపు కాల్స్‌ వస్తున్నందున ఆమె నంబర్‌ సిడిఆర్‌ కావాలంటూ యాదగిరిరెడ్డి శ్రీనివాసరావును సంప్రదించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. శ్రీనివాసరావు వెంటనే అందుకు ఉపక్రమించారు. సిడిఆర్‌లు కావాలంటూ సర్వీస్‌ ప్రొవైడర్లకు కోరే అధికారం కేవలం డిసిపి ర్యాంక్‌ అధికారులకు మాత్రమే ఉంది. దాంతో తన బాస్‌, మల్కాజ్‌గిరి డిసిపి కె.వెంకటేశ్వరరావుకు ఎలాంటి అభ్యర్థన పంపకుండానే శ్రీనివాసరావు ఆయన ఇ-మెయిల్‌ ఖాతా పాస్‌వర్డ్‌ సంపాదించగలిగారు. ఇన్‌స్పెక్టర్‌ డిసిపి క్యాంప్‌ కార్యాలయం నుంచి పాస్‌వర్డ సంపాదించగలిగారు అని వారు తెలిపారు. అలా చేయటం పాస్‌వర్డ్‌ చౌర్యంతో సమానమని వెల్లడించారు. అనంతరం డిసిపి ఇ-మెయిల్‌ నుంచి శ్రీనివాసరావు సర్వీస్‌ ప్రొవైడర్‌ను అభ్యర్ధనతో కూడిన ఒక లేఖ పంపించారు. డిసిపి పేరుతో ఆ లేఖ సర్వీస్‌ ప్రొవైడర్‌కు చేరింది. దర్యాప్తు నిమిత్తం, సిడిఆర్‌ కావాలంటూ అతడు లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. గతంలో సిడిఆర్‌ కోసం అలాంటి అభ్యర్ధనలు ఒక లేఖ ద్వారా చేరేవి. కానీ ఆ రోజుల్లో అలాంటి అభ్యర్ధనలను ఇ-మెయిల్‌ ద్వారా పంపిస్తున్నారు. తన ఖాతా నుంచి అలాంటి ఒక ఇ-మెయిల్‌ వెళ్లిన సంగతి డిసిపికి తెలియదు. శ్రీనివాసరావు తన అభ్యర్ధనతో పాటుగా దర్యాప్తునకు ఉద్దేశించిన వాస్తవమైన అభ్యర్ధనలను కూడా సర్వీస్‌ ప్రొవైడర్‌కు పంపించారని వర్గాలు వెల్లడించాయి. కొద్ది రోజులు తర్వాత చంద్రబాల సిడిఆర్‌ వివరాలతో సర్వీస్‌ ప్రొవైడర్‌ మెయిల్‌ తిరిగి పంపించారు. దాంతో ఇన్‌స్పెక్టర్‌ డిసిపి ఇ-మెయిల్‌ ఖాతాను మరోసారి తెరిచారు. వాస్తవమైన దర్యాప్తు నిమిత్తం మరికొన్ని అలాంటి సిడిఆర్‌లు వచ్చినందున తన బాస్‌ను మోసం చేయటమనేది శ్రీనివాసరావుకు సులభతరమైనదని వారు తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో డిసిపి పాస్‌వర్డ్‌ను ఇన్‌స్పెక్టర్‌కు అందించారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నది. తీవ్రమైన లోపాలు, వాస్తవిక దృశ్యం కొద్ది రోజుల్లో స్పష్టమవుతుంది అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనిపై డిసిపిని సంప్రదించగా వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. ఆ అంశంపై దర్యాప్తు జరుగుతున్నదని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అయితే సర్వీస్‌ ప్రొవైడర్‌కు అభ్యర్ధన పంపించడంలో డిసిపి ఇ-మెయిల్‌ ఖాతాను అనధికారికంగా వాడుకునేంతవరకు శ్రీనివాసరావు వెళ్లినప్పటికీ సాక్షి రిపోర్టర్‌, శ్రీనివాసరావు మధ్య నగదు చేతులు మారిన వ్యవహారం తమ దృష్టికి రాలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. కొత్త మలుపు కేసు దర్యాప్తులో భాగంగా సర్వీసు ప్రొవైడర్‌ను సంప్రదిస్తున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా చంద్రబాల సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత యాదగిరిరెడ్డి, శ్రీనివాసరావులపై కేసులు నమోదు అయ్యాయి. ఐపిసి సెక్షన్‌ 120-బి రెడ్‌విత్‌ సెక్షన్లు 505 (2), 509, 2000 సంవత్సరం నాటి సమాచార సాంకేతిక యాక్ట్‌ సెక్షన్‌ 66, 72, 1885 నాటి భారతీయ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ సెక్షన్‌ 24, 1923 నాటి అధికారిక రహస్యాల యాక్ట్‌ సెక్షన్‌ (5) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. సైబరాబాద్‌ పోలీసుల పరిధిలోని సైబరాబాద్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌ దర్యాప్తు చేస్తుంది.