పౌష్టికాహారం తోనే ఆరోగ్యవంతమైన జీవనం.

ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు.
బెల్లంపల్లి, సెప్టెంబర్23,(జనంసాక్షి)
పౌష్టికాహారం తోనే ఆరోగ్యవంతమైన జీవనం అని ఐసిడిఎస్ సూపర్ వైజర్ జ్యోతి అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోషణ మాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా బొడ్డెమ్మ సంబరాలు జరుపుతున్నామన్నారు. పోషక విలువలు గల ఆహారంను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తినాలని, ఆహారం తినే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రపరుచుకోవాలన్నారు. మొదటి 15 రోజులు పిల్లలందరివి ఎత్తు, బరువులు ,జబ్బచుట్టు కొలతలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తీసుకున్నామన్నారు. గర్భిణీ, బాలింతలు, పిల్లలు సమతుల ఆహారం తీసుకోవాలని పోషణతోనే మంచి ఆరోగ్యం ఉంటుందని వివరించారు.
తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు అవసరమని వివరించారు. పారిశుద్ధ్యం, పోషణ, పసిపిల్లలకు తల్లిపాల ఆవశ్యకత తెలియజేశారు. అనంతరం పోషణ ప్రతిజ్ఞ తల్లులందరిచే చేయించారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ పోలు ఉమాదేవి , గర్భిణిలు, బాలింతలు, తల్లులు, పిల్లలు అంగన్వాడీ టీచర్స్ , ఆయాలు పాల్గొన్నారు.