ప్రణబ్‌, సంగ్మా నామినేషన్లు సక్రమం

న్యూఢిల్లీ, జూలై 3 : విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన పిఎ సంగ్మా నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు. రాష్ట్రపతి పదవికి నామినేషన్లను మంగళవారంనాడు రిటర్నింగ్‌ అధికారి పరిశీలించిన అనంతరం సంగ్మా పత్రాలు సరిగా ఉన్నాయని ధృవీకరించారు. రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ బికె అగ్నిహోత్రి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సంగ్మా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన, బలపరిచిన వారి జాబితాలో తప్పులు ఉన్నాయంటూ కొందరు లేవనెత్తిన అభ్యంతరాలను రిటర్నింగ్‌ అధికారి తోసిబుచ్చారు. ఇదిలా ఉండగా యుపిఎ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన ప్రణబ్‌ముఖర్జీ నామినేషన్‌ పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్‌ అధికారి అగ్నిహోత్రి ప్రకటించారు. ప్రణబ్‌ అభ్యర్థిత్వంపై సంగ్మా, బిజెపి నేతలు చేసిన ఆరోపణలపై ప్రణబ్‌ రిటర్నింగ్‌ అధికారికి వివరణ ఇచ్చారు. ఆయన వివరణతో సంతృప్తి చెందిన రిటర్నింగ్‌ అధికారి నామినేషన్‌ పత్రాలు సక్రమంగా ఉన్నాయని ధృవీకరించారు. కోల్‌కతాలోని ఐఎస్‌ఐ సంస్థలో లాభదాయక పదవిని ప్రణబ్‌ నిర్వహించారని బిజెపి, సంగ్మా ఆరోపించిన విషయం తెలిసిందే. గత నెల 20వ తేదీనే తాను ఆ పదవికి రాజీనామా చేశానని ప్రణబ్‌ స్పష్టం చేశారు. వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పొందుపరచకపోవడం వల్లే ఈ గందరగోళం నెలకొందని, ప్రణబ్‌ గత నెల 20నే రాజీనామా చేశారని ఆ సంస్థ అధికారులు కూడా ప్రకటించారు. అంతేకాక ఆ పదవి గౌరవప్రదమైనదే తప్ప ఎలాంటి ఆర్థిక లబ్ధి ఒనకూరదని కూడా ఐఎస్‌ఐ సంస్త ఇప్పటికే ప్రకటించింది. కాగా రానున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ ప్రణబ్‌, సంగ్మా మధ్యనే నెలకొంది. అయితే తృణమూల్‌ మినహా యుపిఎ భాగస్వామ్య పక్షాలతో పాటు శివసేన, జెడియు, సిపిఎం వంటి పార్టీల మద్దతు కూడా ప్రణబ్‌కు లభించడంతో ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా రాష్ట్రపతి ఎన్నికకు మూడు రోజుల ముందు మాత్రమే తమ పార్టీ వైఖరి ప్రకటిస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. ఎన్ని ఈ నెల 19వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు దాఖలైన నామినేషన్‌ పత్రాలను వాస్తవంగా సోమవారంనాడు పరిశీలించాల్సి ఉంది. అయితే ప్రధాన అభ్యర్థులుగా బరిలోకి దిగిన సంగ్మా, యుపిఎ అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీలపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నామినేషన్ల పరిశీలన మంగళవారంనాటికి వాయిదా పడిన విషయం తెలిసిందే.