ఒలంపిక్స్‌కు కౌంట్‌డౌన్..
ప్రపంచ క్రీడా సంగ్రామానికి సర్వం సిద్ధం
భారీస్థాయిలో ఓపెనింగ్ సెర్మనీ
లండన్, జూలై 26 (జనంసాక్షి) : యావత్ ప్రపంచం వేచి చూస్తోన్న ఒలింపిక్స్ మహా సంబరానికి సమయం దగ్గర పడింది. మరో 24 గంటల్లో లండన్ గేమ్స్ మొదలు కాబోతున్నాయి. సరిగ్గా శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరగనున్న భారీ ఆరంభ వేడుకలతో వీటికి తెరలేవనుంది. జూలై 27 నుంచి ఆగష్టు 12 వరకూ ఇక రికార్డుల మోతతో లండన్ దద్దరిల్లనుంది. ప్రపంచ క్రీడాసంగ్రామంలో సత్తా చాటేందుకు మైకేల్ ఫెల్ఫ్స్, ఉసేన్ బోల్డ్, ఇసన్బయేవా, లోచెట్ లాంటి స్టార్ అథ్లెట్స్ సిద్ధమయ్యారు. ఇప్పటికే లండన్ క్రీడాగ్రామంలో కొలువుదీరిన వీరందరూ ప్రస్తుతం ప్రిపరేషన్‌తో బిజీగా ఉన్నారు. మరి వీరి సంచలనాలు, బద్దలకొట్టబోయే రికార్డులు చూసేందుకు మీరు కూడా సిద్ధంగా ఉన్నారా… సరిగ్గా ఏడేళ్ల క్రితం తమకు ఒలింపిక్స్ అతిథ్యం దక్కిందని సంబరాలలో మునిగితేలిన లండన్ అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. ఒలింపిక్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 74 వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్వహిస్తున్నారు. ముందుగా అనుకున్నదానికంటే ఈ బడ్జెట్ 100 శాతం రెట్టింపయింది. ఆర్థికమాంద్యం వెంటాడుతున్నప్పటకీ ఏ మాత్రం వెనక్కి తగ్గని లండన్ నిర్వాహకులు భారీగానే ఏర్పాట్లు చేశారు. మరో 24 గంటల్లో జరగనున్న ఓపెనింగ్ సెర్మనీ అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. సమయం లేకపోవడం, సెక్యూరిటీ వంటి కారణాలతో ప్రారంభోత్సవ వేడుకలు కుదించినా పలు కార్యక్రమాలు ఆకట్టుకోనున్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకున్న బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్స, ముగింపు వేడుకల తరహాలోనే భారీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా హాలీవుడ్ డైరెక్టర్ డానీ బోయోల్ ఆధ్వర్యంలో జరగనున్న స్పెషల్ ఈవెంట్‌పైనే అందరి దృష్టీ నెలకొని ఉంది. దీని కోసం ఇప్పటికే ఒలింపిక్స్ ప్రధాన స్టేడియం సిద్ధమైంది.
ప్రారంభోత్సవాన్ని 80 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించే విధంగా సరికొత్త స్టేడియాన్ని ఇంగ్లాండ్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్మించింది. ఓపెనింగ్ సెర్మనీకి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు. ఆరంభం వేడుకల సంగతి అటుంచితే.. మొత్తం 202 దేశాల నుంచి 10200 అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పోటీపడబోతున్నారు. వీరి కోసం 4700 పతకాలు ఎదురుచూస్తున్నాయి. 26 క్రీడలలో 302 ఈవెంట్లు జరగనున్నాయి. ఇంగ్లాండ్ ఒలింపిక్స్‌కు అతిథ్యమిస్తుండడం ఇది మూడో సారి. గతంలో 1908, 1948లలో ఒలింపిక్స్ ఇక్కడ జరిగాయి. తాజా గేమ్స్‌కు 20 వేల మీడిమా ప్రతినిధులు కూడా హాజరవనున్నారు. అలాగే వేలాది మంది అభిమానులు పోటీలను ప్రత్యక్షంగా తిలకించేందుకు వస్తుండడంతో లండన్ సిటీ బిజీబిజీగా మారింది. ఎటువైపు చూసినా పండుగ వాతావరణ కనిపిస్తోంది. అటు ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికి వచ్చే అత్యుత్తమ అథ్లెట్లు అత్యాధూనిక వసతులతో కూడిన వేదికలలో పోటీపడనున్నారు. ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఆర్చరీ పోటీలు జరగనున్నాయి. అలాగే గ్రీన్విచ్ పార్క్‌లో ఈక్వెస్ట్రియన్, వెంబ్లీ స్టేడియంలో ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నారు. వీటితో పాటు అథ్లెట్లు నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడకుండా సరికొత్త యాంట డోపింగ్ విధానాన్ని ఉపయోగించబోతున్నారు. ఇప్పటికే టార్చ్ రిలే తుది దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే లండన్ ఒలింపిక్స్ నిర్వాహకులకు భద్రత అతిపెద్ద సవాల్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాల క్రీడాకారులు, ప్రతినిధులు ఇక్కడకి వచ్చే నేపథ్యంలో ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.