ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి

ఆదిలాబాద్‌, జూలై 26 : పేదలకు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ప్రగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. పథకాల అమలు విషయమై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ బాట పథకంలో భాగంగా త్వరలో ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డి జిల్లాకు వస్తున్నందున అధికారులందరూ నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పథకాలు ప్రజలకు చేరుతున్నాయో లేదో తెలుసుకోవాలని సూచించారు. పథకాల అమలులో ఎలాంటి సమస్యలు కానీ, లోపాలు కానీ ఉన్నట్లయితే తన దృష్టికి తేవాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న రూపాయి కిలో బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకం, మరుగుదొడ్ల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, పింఛన్లు తదితర పథకాల అమలును అధికారులు బాధ్యతాయుతంగా చేపట్టాలని అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అన్నారు. వర్షాకాలం ఉన్నందున పారిశుద్ధ్యం, తాగునీటి విషయాలపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.