ప్రమాద సమయంలో..
160 కి.విూ వేగంతో ప్రయాణం
– అందుకే కారు కంట్రోల్ కాలేదు
– నల్గొండ ఎస్పీ రంగనాథ్
హైదరాబాద్, ఆగస్టు29(జనం సాక్షి) : టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు హరికృష్ణ వాహనం ప్రమాదానికి గురైన సమయంలో గంటకు 160 కిలోవిూటర్ల వేగంతో ఉన్నదని నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. బుధవారం ఉదయం 6.15 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి ఉదయం 4.30 గంటలకు బయలుదేరిన హరికృష్ణ నెల్లూరు వెళ్తున్నట్లు తెలిపారు. చిట్యాల దాటిన తర్వాత నార్కెట్‌పల్లి సవిూపంలో గుంటూరు హైవేపై హరికృష్ణ కారు ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. పోలీస్ 12వ బెటాలియన్ గ్రౌండ్స్ దగ్గర కారు నియంత్రణ కోల్పోయిందని, ఈ సమయంలో హరికృష్ణ వాటర్ బాటిల్ కోసం వెనక్కు తిరిగారని తెలిపారు. కారు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టిందని, ఆ సమయంలో కారు గంటకు 160 కిలోవిూటర్ల వేగంతో ఉందని ఎస్పీ పేర్కొన్నారు. వర్షాల కారణంగా రోడ్డు కూడా చిత్తడిగా ఉండటంతో కారు అవతలి వైపునకు ఎగిరి ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకొట్టింది అని రంగనాథ్ తెలిపారు. ఎదురుగా వస్తున్న కారులోని ఒకరికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.


