ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా కుప్పకూలింది
అడిలైడ్: ఆసీస్తో ఆదివారం ఇక్కడ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా కుప్పకూలింది. కంగారూలు నిర్దేశించిన 372 భారీ లక్ష్యాన్ని ఛేదించటంలో భారత్ 45.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఓపెనర్ శిఖర్ ధావన్ (59), రహానె (66), రాయుడు (53) తప్ప మిగతా బ్యాట్స్ మెన్ అందరూ చేతులెత్తేశారు. కోహ్లి (18), రవీంద్ర జడేజా (20) తప్ప మిగతా బ్యాట్స్ మెన్ ఎవరు రెండంకెల స్కోరు చేయలేదు. ఓ దశలో 154/2 గా ఉన్న భారత్ మరి కాసేపట్లో.. 185/7 కు చేరుకుంది. శిఖర్ ధావన్ అవుటయిన తరువాత భారత్ ఏ దశలోనూ కోలుకునే పరిస్థితి కనిపించలేదు.
ఆసీస్ బౌలర్లు కీలక సమయాల్లో వరుస వికెట్లు తీసి భారత్ను దెబ్బతీశారు. కమ్మిన్స్ మూడు, హాజిల్ వుడ్, జాన్సన్, స్టార్క్ రెండేసి వికెట్లు తీసుకుని భారత్ ను కోలుకోలేని దెబ్బతీశారు.
ఆసీస్ అదరహో..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్టేలియా 372 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. ఆదిలో ఫింఛ్(20)వికెట్ ను కోల్పోయినా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(104) పరుగులు చేసి శుభారంభం ఇచ్చాడు. దీంతో తరువాత రెచ్చిపోయిన ఆసీస్ ఆటగాళ్లు దూకుడుగా ఆడి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఆసీస్ ఆటగాడు మ్యాక్స్ వెల్(122;57 బంతుల్లో 11ఫోర్లు,8 సిక్స్ లు ) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. అయితే మ్యాక్స్ వెల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగడంతో ఆసీస్ స్కోరు బోర్డు కాస్త మందగించింది.
ఓ దశలో నాలుగు వందల మార్కును దాటుతుందనే భావించిన ఆసీస్ కు.. మ్యాక్ వెల్ స్టేడియానికి పరిమితం కావడంతో కాస్త జోరు తగ్గింది. వార్నర్, మ్యాక్స్ వెల్ లకు తోడు జార్జ్ బెయిలీ(44) పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. దీంతో ఆసీస్ 48.2 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటయ్యింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీకి మూడు వికెట్లు లభించగా, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మలకు తలో రెండు వికెట్లు దక్కాయి.