బస్తీమే సవాల్!
– పాలేరులో ఓడిపోతే రాజీనామా చేస్తారా?
– ఉత్తమకుమారా.. ప్రగల్భాలు ఆపు!
– ఓడిపోతే నేను రాజీనామా చేస్తా
– మంత్రి కేటీఆర్
ఖమ్మం,మే8(జనంసాక్షి):పాలేరు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఓడిపోతే తను రాజీనామా చేస్తానని ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే రాజీనామాకు సిద్దమేనాఅని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. పాలేరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఖమ్మంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పరాజయం పర్యాయపదంగా మారిందని ఎద్దేవా చేశారు.పాలేరు ఉప ఎన్నికలో తెరాస విజయం తథ్యమని దీమా వ్యక్తం చేశారు. పాలేరులో తెరాస ఓడిపోతే తాను మంత్రి పదవి వదులుకునేందుకు సిద్ధమని.. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్ రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి నైతిక విలువలు, బాధ్యత ఏవిూ లేదని… ప్రతి ఎన్నికకు ఆ పార్టీ నేతలు కుంటిసాకులు వెతుక్కుంటున్నారని విమర్శించారు. పాలేరులో సానుభూతి పేరుతో కాంగ్రెస్ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. పాలేరు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని తాము ప్రజలను కోరుతున్నామని చెప్పారు.రాష్ట్రంలో జరిగే ప్రతీ ఎన్నికల్లో చెప్పేందుకు కాంగ్రెస్ నాయకులు కుంటిసాకులు వెతుక్కుంటున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. సానుభూతిని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ నేతలు అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు ప్రింటర్లు అమర్చేందుకు సిద్ధమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్, టీడీపీ ఖమ్మం జిల్లాకు చేసిందేం లేదు
కాంగ్రెస్, టీడీపీ అరవై ఏళ్లు పాలించినా ఖమ్మం జిల్లాకు చేసిందేమి లేదన్నారు మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు. పాలేరు నియోజకవర్గానికి అన్ని రంగాల్లో అన్యాయం చేసారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. పాలేరు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూసుమంచి మండలంలోని పలుగ్రామాల్లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తుమ్మలను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.
మంత్రి పద్మారావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు తుమ్మల వెంట ప్రచారంలో పాల్గొన్నారు.