బహిరంగ చర్చకు సిద్ధమే: కడియం

హైదరాబాద్, నవంబర్ 11 (జనంసాక్షి): తెలంగాణ సమస్య పరిష్కారం కావాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాల్సిందేనని టీడీపీ సీనియర్ నేత కడియం శ్రీహరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే ఉద్దేశం ఆ పార్టీకి లేదన్నారు. తమ చేతకాని తనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇతరులపై రుద్దేప్రయత్నం చేస్తోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేటీఆర్, హరీష్‌రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. 78 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు, తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఆయనను విమర్శించే స్థాయి వారికి లేదన్నారు. కేసీఆర్ కూడా చంద్రబాబును విమర్శించేందుకు తగడన్నారు. కేటీఆర్, హరీష్‌రావు కొత్త బిచ్చగాళ్లు అని కడియం అభివర్ణించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్న చందాన వారిద్దరు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉద్యమం పేరిట పోరాడే పార్టీ నాయకులు హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. హద్దు దాటితే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందన్నారు. ఈ విషయాలన్నింటినీ గ్రహించి వారు నడుచుకోవాలనికోరుతున్నట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై హరీష్‌రావు విసిరిన సవాల్‌కు తాను సిద్ధమని చెప్పారు. 1994నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధి చర్చించేందుకు ఎక్కడైనా.. ఎప్పుడైనా.. తాను సిద్ధమేనని అన్నారు. ఆ సమయంలో పదేళ్లపాటు మంత్రిగా పనిచేశానని, ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నానని, బహిరంగ చర్చకు తాను అర్హుడినేనని చెబుతున్నానన్నారు. వేదిక ఎక్కడైనా సరే తెలంగాణ జర్నలిస్టుల ఫోరంతో చర్చించి తేదీ, సమయం, స్థలం ప్రకటించాలని డిమాండ్‌చేశారు.



