బిజెపి,కెసిఆర్ ఇద్దరూ ఇద్దరే
కేంద్రాన్ని నిలదీసే దమ్ము కెసిఆర్‌కు లేదు
షర్మిల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పనిలేదు: జీవన్ రెడ్డి
హైదరాబాద్,సెప్టెంబర్27(జనంసాక్షి) బీజేపీ, కేసీఆర్ ఇద్దరు ఒక్కటేనని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలంటే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కేవలం తన పదవి కాపాడుకునే ప్రయత్నాల్లో కెసిఆర్ ఉన్నారని అన్నారు. కేంద్రంతో చర్చల్లో ఏం జరుగుతుందో చెప్పాలన్నారు. దొడ్డు వడ్లను కొనుగోలు చేయమన్న కేంద్రం నిర్ణయంపై నిలదీయాలన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టం విూద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి జుట్టు రాహుల్ గాంధీ చేతిలో… కేసీఆర్ చేతిలో రేవంత్ పిలక ఉంటుందని షర్మిల చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. నిన్న మొన్న పార్టీ పెట్టిన వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడల్సిన అవసరం లేదన్నారు. ఆమె ఎం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావడం లేదన్నారు. షర్మిల మాటలను తాము పెద్దగా పరిగణనలోకి తీసుకొమన్నారు. కాంగ్రెస్ పార్టీ విూద ఆమె ఆరోపణలను చూశాక స్పందిస్తానన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.