భయాందోళనలో నెల్లూరు వాసులు
నెల్లూరు, జూలై 28 : రెండు రోజుల క్రితం భద్రాచలం-చెన్నయ్ బస్సులో ముగ్గురు ప్రయాణీయుల దారుణహత్య ఉదంతం జిల్లాలో దావానలంలా వ్యాపించిన నేపథ్యంలో ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాలో సుమారు 980 గ్రామాలుండగా అగంతకుడు ఏ గ్రామంలో తలదాచుకున్నాడనేది స్పష్టత లేకపోవడంతో జిల్లాలోని నగరాలు, పట్టణాల్లోని ప్రజలు భయంతో కంపించి పోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ సెంటర్లలో సైతం ప్రజలు అతి తక్కువగా తిరగడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చివరికి నెల్లూరు నగరంలోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో సైతం కొనుగోళ్లు పడిపోయాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దిగజారింది. మతి స్థిమితం లేని వ్యక్తులు ఎక్కడ సంచరిస్తున్నా.. వారినే సైకోలుగా భావించి భౌతిక దాడులకు దిగడం పోలీసుస్టేషన్లకు అప్పగించడంతో క్రమంగా శాంతిభద్రతల సమస్యగా మారింది. ఇప్పటికే నెల్లూరు రూరల్ మండలంలోని కొత్తూరు, ముత్యాలంపాలెం ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తుల మీద స్థానిక ప్రజలు భౌతిక దాడులకు దిగి పోలీసులకు అప్పగించారు. ఇదే పరిస్థితి అనేక గ్రామాల్లో పునరావృతమయ్యే అవకాశం ఉందని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అలాగే రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, నగర శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిఘా విభాగాలను ఏర్పాటు చేసి రెండు వైపులా జల్లెడ పడుతుండడంతో ఒక రకమైన ఆందోళన వాతావరణం సర్వత్రా వ్యక్తమవుతోంది.