భాజపాను ఓడించడమే ఇరుపక్షాల లక్ష్యం

– మాయావతి, అఖిలేశ్‌ వ్యాఖ్యలపై ప్రియాంక స్పందన
లఖ్‌నవూ, మార్చి19(జ‌నంసాక్షి) : భాజపాను ఓడించడమే ఇరుపక్షాల లక్ష్యమని  కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో భాజపాను ఓడించే సత్తా బీఎస్పీ-ఎస్పీ కూటమికి ఉందని దానికి కాంగ్రెస్‌ మద్దతు అవసరం లేదన్న మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై మంగళవారం ప్రియాంకా గాంధీ స్పందించారు. ఇరు పక్షాల లక్ష్యం భాజపాను ఓడించడమేనని అన్నారు. మా కార్యకర్తల్లో గందరగోళం సృష్టించొద్దన్న మాయావతి వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. కాంగ్రెస్‌ ఏ పార్టీని ప్రభావితం చేయాలనుకోవట్లేదని ప్రియాంక పేర్కొన్నారు.’ మేం ఏ పార్టీలో గందరగోళం సృష్టించాలనుకోవట్లేదని, మాకు ఎవరితో ఇబ్బందులు లేవన్నారు. మా లక్ష్యం భాజపాను ఓడించడం.. వారి(ఎస్పీ-బీఎస్సీ) లక్ష్యం కూడా అదేఅని ప్రియాంక వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్‌లు పోటీ చేసే రాయ్‌బరేలీ, అమేఠీల నుంచి అభ్యర్థులను బరిలోకి దించబోమని ఎస్పీ-బీఎస్పీ కూటమి ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌ కూడా ములాయం, అజిత్‌ సింగ్‌ సహా ఏడుగురు ప్రముఖ నాయకులు పోటీ చేసే చోట అభ్యర్థులను రంగంలోకి దించకూడదని నిర్ణయించింది. అయితే కాంగ్రెస్‌ ప్రకటన వల్ల తమ కూటమి కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడుతుందని మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. దీనివల్ల రెండు పక్షాలకు మధ్య అంతర్గత ఒప్పందం ఉందనే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. భాజపాను తమ కూటమి ఒంటరిగా ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించుకోవచ్చని హితవు పలికారు.

తాజావార్తలు