భారత ముస్లింలు బతికిపోయారు..!

‘భారత ముస్లింలు బతికిపోయారు’ అని పరోక్షంగా సుప్రీం కోర్టు పరోక్షంగా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ముంబయ్‌ ముట్టడి కేసులో నిందితుడు అజ్మల్‌ కసబ్‌కు ఉరి శిక్షను ఖరారు చేసిన రోజునే దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా అభిప్రాయ పడింది. ఆ రోజు కసబ్‌కు శిక్షను ప్రకటించిన తర్వాత జస్టిస్‌ ఆఫ్తాబ్‌ ఆలం, జస్టిస్‌ సీకే ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఇలా సంచలన వ్యాఖ్యలు చేసింది..

‘ఒకవేళ కసబ్‌ దొరక్క పోయుంటే ముంబయ్‌ ముట్టడి పాపం భారత ముస్లింలకే అంటుకునేది. ఆ ‘ఉగ్రవాదులు’ హైదరాబాదీలే అని ప్రచారం జరిగి ఉండేది. హిందూ ముస్లింల మధ్య తరతరాలకు తరగని ఒక విద్వేషాగ్నికి ఆజ్యం పడేది. కసబ్‌ పట్టుబడక పోతే ‘ముంబయ్‌పై దాడి’ మకిలి ఉగ్రవాదులంతా భారతీయులేనని, హైదరాబాద్‌ నుంచే వచ్చారని ప్రచారం జరిగేది. ముజాహిదీన్‌ అనో, హైదరాబాద్‌ దక్కన్‌ అనో కల్పిత సంస్థలను సృష్టించి, వాటికి బాధ్యత అంటగట్టేవారు. కసబ్‌ సజీవంగా దొరక్క పోతే దర్యాప్తు అధికారులకు చాలా విషయాలు తెలిసేవి కావు. దీంతో భారతీయులే ఈ దాడికి పాల్పడ్డారని ఆ నిందను అమాయక ముస్లింల నెత్తిన రుద్దేవారు. ఇది స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా అనేక విపరీత పరిణామాలకు దారి తీసేది. రెండు వర్గాల మధ్య అపనమ్మకానికి కారణమయ్యేది. ఫలితంగా దేశంలో మత ఘర్షనలు చెలరేగేవి. ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరేది. ఆ పిడుగు భారత, మరీ ముఖ్యంగా హైదరాబాదీ ముస్లింలపైనే పడేది. కానీ, ఓ భారతీయ ముస్లిం అమాయకులను, తోటి భారతీయులను నిర్దయగా, రాక్షసంగా చంపాలని కలలోనైనా కోరుకోడు. ఎందుకంటే, భారతీయ ముస్లింలు విశ్వాసానికి కట్టుబడి ఉంటారు. తమ దేశాన్ని, తమ దేశీయులను ప్రేమిస్తారు.’

ఇది ఆ ఇద్దరు న్యాయమూర్తుల వ్యాఖ్యల సంక్షిప్త సారాంశం. ఈ వ్యాఖ్యలను మరొక్కసారి చదివితే భారత ముస్లింలు ఎంతగా వివక్షకు గురవుతున్నారో తెలుస్తుంది. ఆ న్యాయమూర్తుల మాటలు ‘అలా జరుగనందుకు సంతోషిస్తున్నాం’ అన్నట్లు అనిపిస్తాయి. భారతీయ ముస్లింల దైన్య స్థితిని తెలియపరుస్తాయి. భారత ముస్లింలు తమ దేశంలోనే పరాయివారిగా ఉంటున్నారని, వాళ్లను సాటి వర్గంలోని కొందరు విదేశీయులుగానే పరిగణిస్తున్నారని, అవహేళనగా చూస్తూ, దొంగల్లా బెదిరిస్తున్నారని సుప్రీం వ్యాఖ్యల్లో స్పష్టమవతున్నది. ముఖ్యంగా హైదరాబాదీ ముస్లింల పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనబడుతున్నది. వాస్తవానికి కూడా దేశంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కనీసం ఒక్క హైదరాబాదీ యువకున్నైనా బాధ్యున్ని చేయడం పరిపాటిగా మారింది. దీనికి మొన్న బెంగళూరులో జరిగిన సంఘటనే ఉదాహరణ. క్రికెట్‌ స్టేడియంలో పేలుళ్లుకు కుట్ర చేస్తున్నారని 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం ఓ హైదరాబాదీకి ప్రమేయం ఉందంటూ మన రాజధానికి వచ్చారు. పాతబస్తీ నుంచి ఓ యువకున్ని తీసుకెళ్లారు. ఈ సంఘటన నిజమే కావచ్చు గాక, ఇది అబద్ధమని చెప్పడం ఉద్దేశం కాదు. కానీ, ఇలాంటి అనేక కల్పిత సంఘటనలు గతంలో జరగడం మనం చూశాము. సుప్రీం ఊహించినట్లుగానే ఒకవేళ కసబ్‌ పట్టుబడక పోయుంటే, భారత ముస్లింల పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేది. కచ్చితంగా దేశంలోని చాలా ప్రాంతాలు 2002 నాటి గుజరాత్‌లో ముస్లింల ఊచకోత సంఘటనను మరిపించేవి. లక్షల్లో మానప్రాణ నష్టాల మరక మరోసారి దేశ ప్రతిష్టకు అంటుకుని ఉండేది. నిజమే సుప్రీం వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని ఆలోచించి చూడండి.. నిజంగానే ‘భారత ముస్లింలు బతికిపోయారు’ అని అనిపించక మానదు.