భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

గోదావరి తీరంలో భక్తుల పుణ్యస్నానాలు

కాకినాడ,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): పంచరామక్షేత్రాల్లో ప్రముఖమైనదిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజామున 3గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామికి ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహిక అభిషేకాలు నిర్వహించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం భోజన, వసతి ఏర్పాటు చేసినట్లు ఆలయం ఈవో చలపతిరావు తెలిపారు. భక్తులకు  స్వామి దర్శనం సులువుగా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రసిద్ధ పంచరామక్షేత్రం సామర్లకోట సోమేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 9గంటల వరకు సుమారు 90వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్లు, శీఘ్రదర్శనం కంపార్టమెంట్లలో భక్తులు బారులు తీరారు. రద్దీ కారణంగా స్వామి వారి మూల విరాట్‌ వద్ద అభిషేకాలు నిర్వహిస్తున్నారు. రాత్రికి లింగోద్భావ మహాపూజ, మహా రుద్రాభిషేకం పూజలు జరగనున్నాయి.  రాజమండ్రి నగరంలోని శివాలయాలన్నీ భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున 2గంటల నుంచి ఆలయాల్లో భక్తులు సందడి చేసారు. రాజమండ్రి తీరంలోని గోదావరి పుష్కరఘాట్లలో పుణ్యస్నానాలాచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. కోటిలింగాలపేటలోని ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయంలో రాత్రి ఒంటి గంటకు స్వామివారికి తొలిపూజ నిర్వహించిన అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, విశేషపూజలు చేశారు. అనంతరం భక్తులను ఆలయంలోకి అనుమతించారు. నగరంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చి స్వామివారికి అర్చనలు చేసి దర్శించుకున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు పులి¬ర, పందిరి మహదేవుడు సత్రంలో ఉచిత అన్నదానం కల్పించారు. గోదావరిగట్టున ఉన్న ఉమామార్కండేయస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆలయ మేనేజర్‌ బి.డి.పి.రామారావు పర్యవేక్షణలో సిబ్బంది భక్తులకు అసౌకర్యం లేకుండా దర్శనం జరిగేందుకు సహకరించారు. మూలవిరాట్‌కు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు.