భూదానోద్యమ భూముల దుర్వినియోగంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో భూదానోద్యమ భూముల దుర్వినియోగంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ జి.బాలాజీ, లింగమయ్య గౌడ్, సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తులు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేష్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భూదానోద్యమ భూములను కొందరు వ్యక్తులు తప్పుడు మార్గంలో అమ్ముకుంటూ కోట్లు కూడగట్టుకుంటున్నారన్నారు. ఈ మేరకు వినతిపత్రం, వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్లింగ్‌లు, వివిధ ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలను మంత్రి జైరాం రమేష్‌కు అందజేశారు. దేశవ్యాప్తంగా మాయమైన 2.4 మిలియన్ ఎకరాల భూదానోద్యమ భూముల రికార్డుల గురించి తెలుసుకోవడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఈనెల 20వ తేదీన రెవిన్యూ మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వీరు ఫిర్యాదు చేశారు.