మన ‘లీడర్ల’ చేతగాని తనం వల్లే..

ఆంధ్రాకు మెడికల్‌ కాలేజీలు పోయినయ్‌
సింగరేణిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
కోదండరామ్‌ డిమాండ్‌
హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : మన లీడర్ల చేతగానితనం వల్లనే మెడికల్‌ కాలేజీలన్నీ సీమాంధ్రకు తరలిపోయాయని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. శుక్రవారం గాంధీ ఆస్పత్రి ఆవరణలో తెలంగాణ మెడికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు దీక్షను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మెడికల్‌త కౌన్సిలింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా సింగరేణిలో రాయల్టీ నిధులను కేటాయించి ఆ ప్రాంతంలోనూ ఒక మెడికల్‌ కాలేజీ నిర్మించాలని సూచించారు. సీమాంధ్రలో జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసి, తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. దీక్షకు కోదండరాంతోపాటు టీఆర్‌ఎస్‌ శాసన సభ పక్ష ఉప నాయకుడు హరీశ్‌రావు, తెలంగాణ నగారా అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. దీక్షకు మద్దతు తెలిపిన అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కిరణ్‌, వైద్యారోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి ఢిల్లీకి వెళ్లి తెలంగాణ కోసం మరిన్ని మెడికల్‌ సీట్లు తేవాలన్నారు. ఎన్టీఆర్‌ యూనివర్సిటీని మూడు ముక్కలు చేసి ఒక బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్నారు. కేయూ, ఓయూల పరిధిలో చెరో 50 సీట్లు పెరగడానికి తాము చేసిన ఉద్యమాలే కారణమని వివరించారు. గాంధీ మెడికల్‌ కాలేజీకి కూడా 50 కేటాయించాలని డిమాండ్‌ చేశారు. నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు ఆది నుంచి అన్యాయమే జరుగుతున్నదన్నారు. గాంధీ మెడికల్‌ కళాశాలలో ఉన్న 22 సీట్లకు 20 మంది సీమాంధ్రులే ఉన్నారని తెలిపారు. ఓపెన్‌ కోటాలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని వివరించారు. కవిత మాట్లాడుతూ తెలంగాణలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తే సరిపోదని, వాటికి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కేంద్ర అనుమతితో మెడికల్‌ కాలేజీలు తెస్తే సరిపోదని నర్సింగ్‌ కాలేజీలు కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరారు. టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు తర్వాత తెలంగాణలో కేవలం ఒకే ఒక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేశారని, అదే సీమాంధ్రలో ఉన్న సగం మెడికల్‌ కాలేజీలు రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చినవేనని తెలిపారు.