మల్కాజిగిరిలో పోలీసుల ఆపరేషన్ దాదాపు 2కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
మేడ్చల్ మల్కాజ్‌గిరి,అక్టోబర్23 జనంసాక్షి : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల విలువ గల 4.92 కిలోల మెపిడ్రిన్ డ్రగ్స్‌ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లికి చెందిన పవన్ మెపిడ్రిన్ డ్రగ్‌ను స్థానికంగా విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, మహేశ్ రెడ్డి పేరు చెప్పారు. తక్షణమే పోలీసులు మేడ్చల్‌లోని మహేశ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయగా, ఆయన వద్ద 926 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహేశ్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రామకృష్ణగౌడ్ ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేసి, 4 కిలోల మెపిడ్రిన్ డ్రగ్‌ను సీజ్ చేశారు.ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విూడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రధాన నిందితులైన ఎస్‌కే రెడ్డి, హనుమంత రెడ్డి పరారీలో ఉన్నారు. అయితే విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఈ డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రగ్స్ రవాణాకు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేసినట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రయ్య గౌడ్ తెలిపారు.