మహానటి అద్భుతం అన్న సినీ ప్రముఖులు
హైదరాబాద్,మే9(జనం సాక్షి): అలనాటి తార సావిత్రి బయోపిక్ ‘మహానటి’ చిత్ర బృందానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు.రాజమౌళి తదితర సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. కీర్తి సురేశ్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రమిది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ సినిమాను నిర్మించారు. మిక్కీ జే మేయర్ బాణీలు అందించారు. బుధవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన రాఘవేంద్రరావు ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తను దర్శకత్వం వహించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా సరిగ్గా ఇదే తేదీన విడుదలైందని గుర్తు చేసుకున్నారు. ’28 ఏళ్ళ క్రితం ఇదే రోజున భారీ వర్షం… చాలా పెద్ద సినిమా తీశాం అనే ఆనందం, ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అని ఎదురుచూపు… ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు… మరుసటి రోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో కనిపించింది. మా దత్తు గారికి (అశ్విని దత్) ఆ రోజు ఎంత ఆనందం కల్గిందో ఇప్పటికీ మర్చిపోలేను’. ‘ఇప్పుడు అదే రోజున ‘మహానటి’ విడుదలైంది. ఆ రోజున ‘జగదేక వీరుడు అతిలోకసుందరి’ నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో నేడు ‘మహానటి’ నిర్మించడానికి అంతే ధైర్యం కావాలి. సావిత్రి గారి చరిత్ర తరతరాలకు అందించిన స్వప్న సినిమాకీ, వైజయంతి మూవీస్‌కీ ధన్యవాదాలు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ జీవించింది. శివాజీ గణెళిశన్‌గా దుల్కర్ సల్మాన్ నటన అద్భుతం. నాగ్ అశ్విన్, చిత్ర యూనిట్‌కి నా అభినందనలు’ అని రాఘవేంద్రరావు వరుస ట్వీట్లు చేశారు. సావిత్రిగారి పాత్రలో కీర్తి సురేశ్ నటించిన తీరు, అద్భుతమైన ప్రదర్శనను ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదంటూ దర్శకధీరుడు రాజమౌళి అన్నారు. ఇది కేవలం ఇమిటేట్ చేయడమే కాదు.. ఆమె లెజెండరీ నటికి మళ్లీ జీవం పోశారు. దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించారు. ఇప్పటి నుంచి నేను ఆయన అభిమానిని. నాగ్ అశ్విన్, స్వప్న దత్‌కు శుభాకాంక్షలు. విూలోని నమ్మకం, నిలకడ, సంకల్పం తిరుగులేనివన్నారు. ఇతర నటులు లావణ్య త్రిపాఠి, మంచు లక్ష్మి,మనోజ్, బ్రహ్మాజీ తదితరుల కూడా చిత్రాన్ని అభినందించారు.
—