మహిళలు సమస్యలపై గళం ఎత్తాలి మెత్తాలి – ఐద్వా జిల్లా కార్యదర్శి మహేశ్వరి పిలుపు
జనంసాక్షి , మంథని : అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మంథనిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) జిల్లా కార్యదర్శి ఏ. మహేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టిఆర్ఎస్ , దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయని పసి పిల్లల నుండి మొదలుకొని వృద్ధుల వరకు లైంగిక దాడులకు గురవుతున్నారని ఆరోపించారు. పని ప్రదేశాలలో మహిళలు లైంగిక వేధింపులకు బలవుతున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే తుంచి వేస్తున్నారని అన్నారు. పుట్టిన ఆడ శిశువులను ముళ్ళ పొదల్లో, మురికి కాల్వల్లో వేసి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఈ సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతుందని అన్నారు. మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని మహిళల రక్షణకు చట్టాలు తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. మహిళలకు పని ప్రదేశంలో రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొర్రెoకల సురేష్, కార్మిక మహిళలు పాల్గొన్నారు.