మహిళా శిశు సంక్షేమానికి కృషి

గుంటూరు, జూలై 27 : మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్‌ యార్డులో మహిళా శిశు చైతన్య సదస్సు జరిగింది. ఫిరంగిపురం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సిడిపివో నురాని అధ్యక్షత వహించారు. యర్రం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు పౌషికాహారం అందిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిడిపివో నురాని మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రెపాలు తాగించాలన్నారు. అనంతరం సంరక్షణ బాండ్లును పదిమంది మహిళలకు ఎమ్మెల్యే యర్రం, తదితరలు అందించారు. ముందుగా అంగన్‌వాడీ కార్యకర్తలు తయారు చేసిన పౌష్టికాహార ప్రదర్శనను ఎమ్మెల్యే యర్రం పరిశీలించారు. ఐసిడిఎస్‌ ప్రాజెక్టు సూపర్‌ వైజర్‌ శ్రీదేవి పదార్థాలను తయారు చేసే విధానాన్ని గురించి ఎమ్మెల్యేకు వివరించారు.